కూకట్‌పల్లి దోపిడీలో ట్విస్ట్.. బాధితుడే నిందితుడు

Kukatpally Robbery Twist: Victim is Mastermind

కూకట్‌పల్లి రూ.కోటి దోపిడీ కేసులో సంచలన మలుపు చోటుచేసుకుంది. Hyderabad Kukatpally ₹1 crore robbery case takes a shocking twist as the ‘victim’ himself is identified as the mastermind, with police recovering ₹77 lakh within 24 hours.

హైదరాబాద్‌లో సంచలనం రేపిన రూ.కోటి దారి దోపిడీ కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. ఈ ఘటనలో బాధితుడిగా చెప్పుకున్న వ్యక్తే ఈ నేరానికి ప్రధాన సూత్రధారి అని దర్యాప్తులో బయటపడింది. హవాలా సొమ్ముపై కన్నేసిన అతడు తన స్నేహితులతో కలిసి పక్కా ప్రణాళికతో దోపిడీ నాటకం ఆడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో రూ.77 లక్షలను రికవరీ చేశారు.

సోమవారం కూకట్‌పల్లిలో జరిగిన ఈ ఘటన నగరంలో కలకలం రేపింది. హవాలా డబ్బును తరలిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి డబ్బుతో పారిపోయారని మొదట సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా అసలు కథ బయటపడింది. హవాలా సొమ్ము తీసుకెళ్తున్న వ్యక్తే తన ఫ్రెండ్స్‌తో కలిసి దాన్ని కాజేయడానికి కుట్ర పన్నినట్లు వెల్లడైంది.

కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ కేసులో నలుగురు నిందితులను శంషాబాద్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం రూ.1 కోటి దోపిడీ జరగగా, అందులో రూ.77 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. బహదూర్‌పురాకు చెందిన ఖుస్రుద్దీన్, అజీముద్దీన్ హవాలా డబ్బుతో వెళ్తుండగా, నిందితులు బైక్‌లపై వచ్చి కళ్లలో కారం చల్లి డబ్బు అపహరించినట్లు ప్రారంభ కథనం ఉంది.

దర్యాప్తులో భాగంగా, ప్రధాన నిందితుడు ఖుస్రుద్దీన్ తన స్నేహితులకు సమాచారం ఇచ్చి పథకం రచించినట్లు పోలీసులు తెలిపారు. కూకట్‌పల్లి మెట్రో పిల్లర్ నంబర్ 836 వద్ద ఈ దాడి జరిగింది. కళ్లలో కారంపొడి చల్లడంతో బైక్ అదుపుతప్పి బస్సును ఢీకొట్టింది. ఆ గందరగోళాన్ని ఉపయోగించుకుని నిందితులు డబ్బుతో పరారయ్యారు.

ఘటన సమయంలో అక్కడి నుంచి వెళ్తున్న ఒక పోలీస్ కానిస్టేబుల్ వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులను గమనించిన నిందితులు తమ హోండా యాక్టివా వాహనాన్ని అక్కడే వదిలి పారిపోయారు. ఆ స్కూటీ నంబర్ ఆధారంగా దర్యాప్తు జరిపిన పోలీసులు అది ఒక మహిళ పేరుపై రిజిస్టర్ అయి ఉండగా, దాన్ని సోహెల్ అనే వ్యక్తి ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. ఫోన్ సిగ్నల్ ట్రాకింగ్ ద్వారా అతడు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఉన్నట్లు పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

English Summary:
Police in Hyderabad cracked the sensational ₹1 crore Kukatpally robbery case within 24 hours, revealing that the complainant himself masterminded the crime. He allegedly conspired with friends to loot hawala money he was transporting. The accused staged an attack using chilli powder near Metro Pillar No. 836, creating a diversion before escaping with cash. Police arrested four suspects near Shamshabad and recovered ₹77 lakh. The case was solved using quick field response, vehicle tracking, and mobile signal analysis.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *