The Telangana government is set to sign an MoU with Harvard University to conduct executive education classes for senior officials

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు హార్వర్డ్ యూనివర్సిటీ నిపుణులతో ఎగ్జిక్యూటివ్ క్లాసులు నిర్వహించేందుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. హైదరాబాద్‌లోనే ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ నిర్వహించే దిశగా డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థతో హార్వర్డ్ యూనివర్సిటీ సూత్రప్రాయంగా అంగీకరించిందని తెలిపారు.
The Telangana government is set to sign an MoU with Harvard University to conduct executive education classes for senior officials. The program is likely to be held in Hyderabad in collaboration with Dr. MCR HRD Institute.
రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు Harvard University నిపుణులతో ఎగ్జిక్యూటివ్ తరగతులు నిర్వహించేందుకు త్వరలో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. హైదరాబాద్‌లోనే ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ నిర్వహించేందుకు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCRHRDI)తో ఒప్పందానికి హార్వర్డ్ యూనివర్సిటీ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు వెల్లడించారు.
MCRHRDIలో ఫౌండేషన్ కోర్సు పూర్తి చేసిన గ్రూప్–I (271 మంది), గ్రూప్–II (175 మంది) అధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. శిక్షణ సమయంలో అభ్యర్థులు నేర్చుకున్న అంశాలు, ఫీల్డ్ విజిట్ అనుభవాలపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను పరిశీలించి పలు సూచనలు చేశారు. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన అధికారులను అభినందించారు.
సభలో మాట్లాడుతూ, విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. విధులు నిర్వర్తించే సమయంలో ఎస్.ఆర్. శంకరన్‌ను ఆదర్శంగా గుర్తుంచుకోవాలని, పేదలకు సేవ చేయాలనే తల్లిదండ్రుల విలువలను మరిచిపోకూడదన్నారు. మంచి పని చేయడానికి విచక్షణ, అధికారం సరిపోతాయని, చట్టాలు, నియమాలు ప్రజలకు సహాయం చేయడానికే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు.
కొద్ది కాలం క్రితం విద్యార్థులుగా, నిరుద్యోగులుగా ఉన్న అభ్యర్థులు ఈరోజు తెలంగాణ ప్రభుత్వ అధికారులుగా మారారని చెప్పారు. నాలుగు కోట్ల ప్రజలకు ప్రజాపాలన అందించడంలో ఈ శిక్షణ, అనుభవం ఉపయోగపడాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజలు ఆకలిని భరించినా ఆధిపత్యాన్ని అంగీకరించరని, సామాజిక న్యాయం కోసం ఈ ప్రాంత ప్రజలు పోరాడిన చరిత్రను గుర్తు చేశారు.
2011 తర్వాత గ్రూప్–I నిర్వహణలో ఏర్పడిన అంతరాయాల నేపథ్యంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేసి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. నియామకాలపై వచ్చిన ఆరోపణలను ప్రభుత్వం న్యాయపరంగా ఎదుర్కొని, మెరిట్ ఆధారంగా ఎంపికైన అభ్యర్థుల హక్కులను కాపాడిందన్నారు.
ఒక అధికారిగా గుర్తింపు పొందాలంటే 30–35 సంవత్సరాలపాటు నిబద్ధతతో పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు. అధికారుల చిత్తశుద్ధి ప్రభుత్వానికి మంచి పేరు తెస్తుందని, ప్రభుత్వ విధానాలను ప్రజలకు చేరవేయడంలో మీరే కళ్లు, చెవులని పేర్కొన్నారు.
తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తుంచుకోవాలని, వారిని గౌరవంగా చూసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ఉద్యోగుల జీతాల్లో నుంచి కొంత మొత్తాన్ని వారి ఖాతాల్లో జమ చేసే విధంగా చట్టం తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు వేమనరెడ్డి, MCRHRDI వైఎస్ చైర్‌పర్సన్, డైరెక్టర్ జనరల్ శాంతి కుమారి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.