ENG vs IND: ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ జట్టు పట్టుబిగించింది. ఇంగ్లాండ్‌ను దాదాపు ఓటమి అంచుల్లోకి నెట్టింది.
నాల్గోరోజుఆటలో భారత జట్టు రెండో ఇన్నింగ్స్ ను 427/6 వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించిన భారత్ జట్టు.. రెండో ఇన్నింగ్స్ కలుపుకొని ఇంగ్లాండ్ ముందు 608 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే, నాల్గోరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 72 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఇంగ్లాండ్ ఇప్పటి వరకు బజ్‌బాల్‌నే ఫాలో అయింది. ఒకవేళ ఐదోరోజు ఆటలో ఇంగ్లాండ్ బ్యాటర్లు బజ్‌బాల్ ఆటతీరును ఫాలో అయినా భారత్ జట్టు ముందు వారి ఆటలు సాగేపరిస్థితి లేదు. కనీసం డ్రా చేసుకోవడం కూడా ఇంగ్లాండ్ జట్టుకు పెద్ద సవాల్ అనే చెప్పొచ్చు.
గత గణాంకాలు చూస్తే..
భారత జట్టు గతంలో 500 నుంచి 600 పరుగుల మధ్య ప్రత్యర్థి జట్టుకు లక్ష్యాన్ని ఉంచిన సమయంలో ఒక్కసారి కూడా ఓడిపోలేదు. మొత్తం 10 టెస్టుల్లో తొమ్మిది విజయాలను టీమిండియా నమోదు చేసింది. కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే డ్రా అయింది. న్యూజిలాండ్ సొంతగడ్డపై ఆ జట్టుకు టీమిండియా 617 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కానీ, ఐదోరోజు ఆటలో కివీస్ 281 పరుగులు చేసి ఎనిమిది వికెట్లు కోల్పోయింది. దీంతో మ్యాచ్ డ్రా అయింది. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో సిరాజ్, ఆకాశ్ దీప్‌లు అద్భుతమైన బౌలింగ్‌తో ఇంగ్లాండ్ బ్యాటర్లను హడలెత్తిస్తున్నారు. స్పిన్‌కు అనుకూలిస్తే జడేజా, సుందర్ బౌలింగ్‌లో ఆడటం ఇంగ్లాండ్ బ్యాటర్లకు అంత ఈజీకాదు. ఎటు చూసినా ఇంగ్లాండ్ విజయం దాదాపు అసాధ్యం.. అదే సమయంలో టీమిండియా బౌలింగ్ దూకుడు చూస్తుంటే.. ఇంగ్లాండ్ బ్యాటర్లు ఎక్కువ సేపు క్రీజులో నిలవడం కూడా కష్టమేనని మాజీ క్రికెటర్లు అంచనా వేస్తున్నారు. అధికశాతం టీమిండియాకే విజయావకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నారు.
600కుపైగా టార్గెట్ ఉన్న సమయాల్లో ఇంగ్లాండ్ పరిస్థితి ఇదీ..
600కుపైగా లక్ష్యం ఉన్న సమయాల్లో గతంలో ఇంగ్లాండ్ జట్టు దాదాపు అన్నిసార్లు ఓటమి పాలైంది. దక్షిణాఫ్రికా జట్టుతో ఒక్కసారి మాత్రమే డ్రా చేసుకోగలిగింది. బజ్‌బాల్ ఆడటం మొదలు పెట్టిన నాటినుంచి కూడా ఇంగ్లాండ్ జట్టు ఒక్కసారి కూడా 600కుపైగా స్కోర్ ఉన్న సమయాల్లో విజయం సాధించలేదు.. మ్యాచ్ డ్రా కూడా అవ్వలేదు.
గతంలో ఇలా..
♦ 1934లో (708 పరుగులు) ఆసీస్ చేతిలో ఓటమి
♦ 1939లో (696) దక్షిణాఫ్రికాతో మ్యాచ్ డ్రా
♦ 1920లో (689) ఆస్ట్రేలియా చేతిలో ఓటమి
♦ 1920లో (659) ఆసీస్ చేతిలో ఓటమి
♦ 2024లో (658) కివీస్ చేతిలో ఓటమి
♦ 2006లో (648) ఆసీస్ చేతిలో ఓటమి
♦ 2019లో (628) విండీస్ చేతిలో ఓటమి
♦ 1930లో (617) విండీస్ చేతిలో ఓటమి
♦ 1924లో (605) ఆసీస్ చేతిలో ఓటమి
♦ 1950లో (601) విండీస్ చేతిలో ఓటమి