జయశంకర్ భూపాలపల్లి:
సరస్వతీ పుష్కరాల సందర్భంగా త్రివేణి సంగమం ఒడ్డున నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను భక్తిరసంలో నిమగ్నం చేశాయి. గత పదకొండు రోజులుగా ప్రతిరోజూ సాయంకాలం గంగా హారతితో ముగిసే ఈ కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ రోజు ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి శివనామ స్మరణతో భక్తులను ఉర్రూతలూగించారు.
“నాలోన శివుడు కలడు… మీలోన శివుడు కలడు…” అంటూ పాడుతూ భక్తులను కూడ నిమగ్నం చేశారు.
భరణి మాట్లాడుతూ, “చాలా సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాను. అప్పట్లో ఇది అడవి మధ్యలో ఉండేది. ఇప్పుడు ఇక్కడికి రావడం ఎంతో ఆనందంగా ఉంది” అని భావోద్వేగంగా అన్నారు.
శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ మహాత్మ్యాన్ని వివరిస్తూ, “పుష్కరాలలో పాల్గొనడం శివుని అనుగ్రహం” అని చెప్పారు.
ఇంతకుముందు జరిగిన మతలయ్య వారి సుందరకాండం పారాయణం, కూచిపూడి, పేరిణి నృత్యాలు భక్తులను అలరించగా, గంగా హారతిలో శివనామ శ్లోకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడ్డాయి.
