
ఓటుబ్యాంకు రాజకీయాలే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రాధాన్యంగా మారాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు విమర్శించారు. 42% బీసీ రిజర్వేషన్ల అంశంలో కేంద్రంపై ఆరోపణలు చేసి ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. ప్రభుత్వానికి 9వ షెడ్యూల్ ప్రక్రియ, న్యాయ పరిమితులపై స్పష్టత లేదని తెలిపారు.
Vote bank politics have become the top priority for the Congress government, alleged BJP Telangana president N. Ramchander Rao. He criticised the Congress for misleading the public and blaming the Centre over the 42% BC reservations issue, while lacking clarity on constitutional procedures.
కాంగ్రెస్ ప్రభుత్వం ఓటుబ్యాంకు రాజకీయాలకు తలవంచిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మండిపడ్డారు. డిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశాన్ని రాజకీయంగా వాడుకుంటూ కాంగ్రెస్ మతపరమైన కోణాన్ని చేర్చి ప్రజలను గందరగోళానికి గురిచేస్తోందన్నారు. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినపుడు బిజెపి మద్దతు తెలిపినా, కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా ముస్లిం మైనారిటీలకు 10% రిజర్వేషన్లు చేర్చే కుట్ర చేస్తోందని ఆరోపించారు.
ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో 46 సార్లు పర్యటించినా, రాహుల్ గాంధీ ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ ఇవ్వకపోవడాన్ని ప్రజలపై అవమానంగా అభివర్ణించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో 9వ షెడ్యూల్ చర్చించకుండానే కేంద్రంపై నిందలు వేయడం అన్యాయమని అన్నారు. 1973 కేశవనంద భారతీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉదహరించారు. 9వ షెడ్యూల్లో చేర్చినా, ఏదైనా చట్టం జ్యుడిషియల్ రివ్యూకు లోబడి ఉంటుందని గుర్తుచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 9వ షెడ్యూల్ ప్రక్రియను తెలుసుకోకుండానే ఆర్డినెన్స్ ప్రవేశపెడుతుందని విమర్శించారు. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285లో సవరణ చేయకపోతే 42% రిజర్వేషన్లు అమలుకావడం సాధ్యం కాదని పేర్కొన్నారు. మత ఆధారిత రిజర్వేషన్లకు బిజెపి పూర్తి వ్యతిరేకతను వ్యక్తం చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం చేయడానికే కాంగ్రెస్ ఈ నాటకం చేస్తోందని ఆరోపించారు.
రాంచందర్ రావు మాట్లాడుతూ, బీజేపీ పార్టీకి క్రమశిక్షణ ప్రాధాన్యమని, ఎవరు తప్పించినా చర్యలు తప్పవని అన్నారు. పార్టీ లోపల కొత్త–పాత తేడాలు లేవని, అందరూ సమానమేనని తెలిపారు. బీజేపీ బలోపేతం కోసం ఢిల్లీలో జాతీయ నాయకత్వాన్ని కలవడం జరిగిందని తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులను కలవబోతున్నట్లు వెల్లడించారు.