The second convocation of Telangana University was held with grandeur, highlighting its academic excellence, infrastructural development, and future expansion plans. Governor and Chancellor Jishnu Dev Varma commended the university’s growing stature and contributions.

తెలంగాణ విశ్వవిద్యాలయ రెండవ స్నాతకోత్సవం ఘనంగా – రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచిన విద్యాసంస్థ

The second convocation of Telangana University was held with grandeur, highlighting its academic excellence, infrastructural development, and future expansion plans. Governor and Chancellor Jishnu Dev Varma commended the university’s growing stature and contributions.

తెలంగాణ విశ్వవిద్యాలయం రెండవ స్నాతకోత్సవం బుధవారం విశిష్టంగా జరిగింది. గవర్నర్ మరియు విశ్వవిద్యాలయ చాన్సలర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరై స్నాతకోత్సవాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేక గుర్తింపు సాధించిన ఈ సంస్థ, విద్యా, పరిశోధన రంగాల్లో అందించుతున్న సేవలు గర్వించదగినవని ఆయన పేర్కొన్నారు.

స్నాతకోత్సవ వేడుకలు విశ్వవిద్యాలయ క్రీడామైదానంలో జరగగా, భారీ బందోబస్తు, స్నిఫర్ డాగ్ స్క్వాడ్‌, బాంబు స్క్వాడ్‌, ఇంటలిజెన్స్ పర్యవేక్షణలో కార్యక్రమం విజయవంతంగా పూర్తైంది. గౌరవ వందనం ఇచ్చిన ఆర్ఎస్ఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలోని గాడ్ ఆఫ్ హానర్ టీం, బ్యాండ్ టీం ఆకర్షణగా నిలిచాయి.

గవర్నర్ మాట్లాడుతూ, తెలంగాణ విశ్వవిద్యాలయం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా, అభివృద్ధికి ప్రేరణగా మారిందన్నారు. ఈ విశ్వవిద్యాలయం 2006లో ఆరు కోర్సులతో ప్రారంభమై ప్రస్తుతం 31 కోర్సులతో, బిక్నూర్, సారంగపూర్ క్యాంపస్‌లతో కలిపి విస్తరించిందని వివరించారు.

విద్యార్థుల నైపుణ్యాలు, పరిశోధనల ద్వారా ఈ విద్యాసంస్థ పారిశ్రామిక సంబంధాల పరంగా కూడా ముందుకెళ్తోందని చెప్పారు. విద్య అంతిమంగా ఒక వ్యక్తిని సమగ్రంగా తీర్చిదిద్దాల్సిన శక్తిగా ఉండాలని, అది చరిత్రను సృష్టించగల సామర్థ్యం కలిగిఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

భారత రసాయన శాస్త్ర సాంకేతిక సంస్థ మాజీ డైరెక్టర్ ఆచార్య చంద్రశేఖర్ మాట్లాడుతూ, విద్యార్థులు అవకాశాల వైపు దృష్టి సారించి భయాన్ని దాటాల్సిన అవసరం ఉందన్నారు. విద్య జీవితాన్ని తీర్చిదిద్దే ఓ ప్రయాణం అని గుర్తించాలన్నారు.

వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యాదగిరిరావు మాట్లాడుతూ, సమీప భవిష్యత్తులో ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలలు, బాలికల హాస్టల్, 1,000 మంది కెపాసిటీతో ఆడిటోరియం వంటి మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి సారిస్తామని చెప్పారు. విశ్వవిద్యాలయ పరిధిని నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి ఆదిలాబాద్, నిర్మల్ వరకు విస్తరించే కృషి జరుగుతోందన్నారు.

ఈ స్నాతకోత్సవంలో 15 విభాగాల్లో 2014 నుండి 2023 మధ్యకాలంలో 132 మందికి బంగారు పతకాలు, 156 మంది పరిశోధకులకు డాక్టరేట్ పట్టాలు ప్రదానం చేశారు. డీన్స్, అధ్యాపకులు, విద్యార్థులు, బోధనేతర సిబ్బంది, అతిథులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్న ఈ వేడుక విద్యాభివృద్ధికి అంకితంగా నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *