తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి చెలరేగింది. సీఎం రేవంత్ రెడ్డి తాజాగా మాజీ సీఎం కేసీఆర్‌కు కఠినమైన సవాల్ విసిరారు. చర్చ ఏ టాపిక్‌పైైనా సిద్దమంటూ.. అవసరమైతే కేసీఆర్ ఫామ్‌హౌజ్‌కి కూడా వెళ్లేందుకు రెడీ అని స్పష్టం చేశారు. అయితే దీనిపై బీఆర్‌ఎస్ నేతలు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది ఓ స్ట్రాటజీ అని, కేసీఆర్‌ను రెచ్చగొట్టే ప్రయత్నమేనని అభిప్రాయపడుతున్నారు.
గతంలో కూడా రేవంత్ అనేక సవాళ్లు విసిరినా, కేసీఆర్ స్పందించకపోవడమే కాకుండా… తన ప్రసంగాల్లో ఎక్కడా రేవంత్ పేరూ ఎత్తలేదు. ఇది రేవంత్‌ను కేసీఆర్ లైట్ తీసుకుంటున్న సంకేతంగా బీఆర్‌ఎస్ భావిస్తోంది. అసెంబ్లీలో రేవంత్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ, మాట్లాడే తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఈసారి మాత్రం కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లో చర్చకు రమ్మనడమే దుమారం రేపుతోంది. కాంగ్రెస్ నేతలు కేసీఆర్‌ను రెచ్చగొట్టేలా ప్రయత్నిస్తున్నారని బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. అలాగే, బీఆర్‌ఎస్ తరఫున ఎవరు చర్చకు రావాలో నిర్ణయించేది తమమనే స్పష్టం చేస్తోంది. కేటీఆర్, హరీశ్ రావులు ఇప్పటికే చురుగ్గా బదులిస్తున్నారు.
ఒక్కసారి అయినా కేసీఆర్ స్పందించాలని రేవంత్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. అయితే రెండు మూడు రోజుల్లోనే కేసీఆర్ మీడియా సమావేశం పెట్టి, సాగుతున్న ఆరోపణలకు సమాధానం చెప్పనున్నారనే సమాచారం గులాబీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.