BJP Rules Out Alliance with BRS in Telangana, Ramchander Rao Reacts on Iran War and Oil Supply

తెలంగాణలో బీఆర్ఎస్‌తో బీజేపీ పొత్తు ఉంటుందనే ప్రచారాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఖండించారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు అవకాశం ఇస్తారని ఆయన తెలిపారు. అలాగే మధ్యప్రాచ్యంలో యుద్ధం ఉన్నప్పటికీ భారత్‌లో చమురు కొరత ఏర్పడదని ధీమా వ్యక్తం చేశారు.
Telangana BJP President Ramchander Rao dismissed speculation about an alliance between BJP and BRS in the state, stating that people will give an opportunity to BJP in the next elections. He also expressed confidence that the ongoing conflict in the Middle East will not lead to any oil shortage in India.
హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులను పార్టీ లోకి ఆహ్వానించిన సందర్భంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీతో ఎలాంటి పరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు బీఆర్ఎస్, బీజేపీలు కలిసి పోటీ చేస్తాయన్న ప్రచారం పూర్తిగా అసత్యమని పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య పొత్తు ఉంటుందన్న ప్రచారాన్ని రాష్ట్ర ప్రజలు నమ్మరని అన్నారు.
తెలంగాణ ఏర్పాటుకు తర్వాత ప్రజలు రెండుసార్లు బీఆర్ఎస్ పార్టీకి, ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని ఇచ్చారని గుర్తు చేశారు. అయితే వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
గతంలో తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ పార్టీ అయినా, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అయినా రాష్ట్రాన్ని మరియు హైదరాబాద్ నగరాన్ని ఎంఐఎం పార్టీ ప్రభావానికి వదిలేస్తున్నాయని విమర్శించారు.
మధ్యప్రాచ్యంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై కూడా రాంచందర్ రావు స్పందించారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు సంయుక్తంగా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దేశంలో భయాందోళనలు సృష్టిస్తోందని ఆరోపించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలు ప్రజల్లో అనవసర భయాలను కలిగిస్తున్నాయని విమర్శించారు. అయితే ఈ యుద్ధం కారణంగా భారత్‌లో ఎలాంటి చమురు కొరత తలెత్తదని స్పష్టం చేశారు.
2014కు ముందు భారత్ కేవలం 16 దేశాల నుంచే ముడి చమురును దిగుమతి చేసుకునేదని తెలిపారు. కానీ 2014లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుచూపుతో 47 దేశాల నుంచి చమురు కొనుగోళ్లు ప్రారంభించిందని చెప్పారు. ఈ దేశాల్లో రష్యా కూడా ఉందని పేర్కొన్నారు.
అందువల్ల ప్రస్తుతం ఇరాన్‌లో యుద్ధ పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్‌కు అవసరమైన చమురు నిల్వలు ఉన్నాయని, దేశంలో కొరత ఏర్పడదని ఆయన తెలిపారు.
ఇక 2005లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఐఏఈఏలో ఇరాన్‌కు వ్యతిరేకంగా ఓటు వేసిందని గుర్తు చేశారు. ఆ నిర్ణయం కారణంగానే ఇరాన్ భారతదేశానికి ముడి చమురు సరఫరాను నిలిపివేసిందని చెప్పారు. ఇది అధికారికంగా నమోదైన విషయం అని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ ఇరాన్‌కు అనుకూలంగా మాట్లాడుతోందని విమర్శించారు.