Minister Ponnam Prabhakar held a review meeting with officials to ensure seamless arrangements for the ongoing Ashada Bonalu festivities in Hyderabad.

ఆషాఢ మాస బోనాలు ఉత్సవాలకు అన్ని విభాగాల సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు – మంత్రి పొన్నం ప్రభాకర్
Minister Ponnam Prabhakar held a review meeting with officials to ensure seamless arrangements for the ongoing Ashada Bonalu festivities in Hyderabad.
హైదరాబాద్:
ఆషాఢ మాస బోనాల సందర్భంగా అధికారులు నిర్లక్ష్యం లేకుండా విధులు నిర్వర్తించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. హైదరాబాద్ అంబర్ పేట నియోజకవర్గంలో వివిధ ఆలయాలకు బోనాల కోసం ప్రభుత్వం విడుదల చేసిన రూ.20 కోట్ల నుంచి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఎమ్మెల్సీ బలమురి వెంకట్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు విహెచ్, కార్పొరేటర్లు, ఆలయ కమిటీలతో పాటు పోలీస్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ శాఖల అధికారులు పాల్గొన్నారు.
మంత్రి పూనమ్ మాట్లాడుతూ, “మహంకాళి అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షిస్తున్నాం. గత సంవత్సరం చేసిన తప్పిదాలు ఈ సారి పునరావృతం కాకుండా చూసుకోవాలి” అని చెప్పారు. వర్షం లేని రోజుల్లో 48 గంటల్లో రోడ్డు సమస్యలను పరిష్కరించాలని సూచించారు.
గత నెల 26న గోల్కొండ బోనాలతో ప్రారంభమైన ఉత్సవాలు, జూలై 1న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, జూలై 13న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు, జూలై 20న లాల్‌దర్వాజా బోనాలతో కొనసాగనున్నాయని తెలిపారు. జంట నగరాల్లో 3వేలకుపైగా దేవాలయాల్లో బోనాల పూజలు జరుగనున్నాయని పేర్కొన్నారు.
ఉత్సవాల కోసం మహిళా భక్తుల రక్షణకు ప్రత్యేక చర్యలు, ఈవ్ టీజింగ్ నివారణకు మహిళా పోలీసుల ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ట్రాఫిక్ సమస్యలను నివారించేందుకు ఈసారి ఫ్లైఓవర్ ప్రారంభమైన నేపథ్యంలో, ట్రాఫిక్ డైవర్షన్ ప్లాన్ రూపొందించాలని సూచించారు.
అమ్మవారి ఊరేగింపు రోజు సీపీఎల్ రోడ్డులో ట్రాఫిక్ మళ్లింపు, చైన్ స్నాచింగ్ నివారణకు ప్రత్యేక బందోబస్తు, మహిళా భక్తుల రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. శానిటేషన్, డ్రైనేజీ లీకేజీలు, మంచినీటి పాకెట్లు, మొబైల్ టాయిలెట్లతో పాటు ఎమర్జెన్సీ బృందాలు, అంబులెన్సులు, మెడికల్ క్యాంప్ ఏర్పాట్లపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు.
మహంకాళి, నల్ల పోచమ్మ, ముత్యాలమ్మ ఆలయాల వద్ద వేదికలు, వాటర్ ప్రూఫ్ స్టేజ్‌లు ఏర్పాటు చేయాలని, ఆర్టీసీ బస్సులు ఆలయాల దిశగా వెళ్లేలా సౌకర్యాలు కల్పించాలన్నారు. దేవాదాయ, జలమండలి, విద్యుత్, ఫైర్ విభాగాలతో సమన్వయం చేసి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.