వైఎస్ వివేకా హత్య కేసు ఇప్పుడిప్పుడే ఒక కొలిక్కి వస్తోంది. తాజాగా ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్?రెడ్డిని ఆదివారం తెల్లవారుజామున విచారించిన అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి వాహనంలో హైదరాబాద్‌కు తీసుకువస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం సీబీఐ మేజిస్ట్రేట్ ఇంటి వద్ద హాజరు పరచనున్నారు. భాస్కర్?రెడ్డి అరెస్ట్ మెమోను ఆయన భార్య లక్ష్మీకి అందజేశారు. అలాగే వైఎస్ వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు సీబీఐ అధికారులు కుటుంబ సభ్యులకు తెలిపారు.
ఈ సందర్భంగా సీబీఐ అధికారులు విూడియాతో మాట్లాడుతూ వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. మధ్యాహ్నం సీబీఐ మేజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తామన్నారు. భాస్కర్ రెడ్డిపై సెక్షన్ 120బి, రెడ్ విత్ 201, 302 ఐపీసీ కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి పాత్ర కీలకంగా ఉందని పేర్కొన్నారు. వివేకా హత్యకు ముందు.. తరువాత నిందితులను భాస్కర్ రెడ్డి ఇంటికి పిలిచి మాట్లాడారని తెలిపారు. ఇందుకు వైఎస్ లక్ష్మీ, పీ జనార్దన్ రెడ్డిలను సాక్షులుగా పేర్కొన్నారు. 120బి కుట్ర, 302 ముర్డర్, 201 ఆధారాలు చేరిపివేయడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు.
కాగా వైఎస్ వివేకా హత్యకేసు విచారణలో సీబీఐ అధికారులు దూకుడు పెంచారు. విచారణలో భాగంగా రెండో రోజు ఆదివారం తెల్లవారుజామున అధికారులు రెండు వాహనాల్లో పులివెందులలోని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్?రెడ్డిని విచారించిన అధికారులు.. ఆయనను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి వాహనంలో హైదరాబాద్‌కు బయలుదేరారు. మొన్న ఉదయకుమార్ రెడ్డి.. నేడు భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇక సీబీఐ అధికారులు వరుస అరెస్టుల పర్వం కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పులివెందులలో హైటెన్షన్ నెలకొంది. మరోవైపు వివేకా హత్యకేసులో ఎంపీ అవినాష్‌రెడ్డిని ఇప్పటికే సీబీఐ అధికారులు 4సార్లు ప్రశ్నించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న అవినాష్‌రెడ్డి ఇంటికి సీబీఐ బృందం వెళ్లింది. ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.