ప్రపంచంలోనే ప్రప్రథమంగా బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ 125 అడుగుల మహా విగ్రహాన్ని అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని సీఎం ఆవిష్కరించారు.
ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు దార్శనికతతో, దేశ చరిత్రలో తెలంగాణ రాష్ట్రం మరో నూతన అధ్యాయాన్ని లిఖించింది. ప్రపంచంలోనే ప్రప్రథమంగా బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ 125 అడుగుల మహా విగ్రహాన్ని అంబేద్కర్ జయంతి సందర్భంగా సీఎం ఆవిష్కరించారు. తద్వారా తెలంగాణ ఆదర్శంగా భారతదేశంలో వొక నవ శకం ప్రారంభమైంది. వివక్షకు గురవుతూ, తర తరాలుగా విస్మరించబడుతూ వస్తున్న దళిత, తదితర వర్గాల పట్ల ఈ దేశ పాలకులు అనుసరించాల్సిన విధానాలకు అసలు సిసలు భాష్యం చెప్తూ అంబేద్కర్ సాక్షిగా తెలంగాణ వేదికైంది. అంబేద్కర్ మహా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన బాబాసాహెబ్ మనుమడు ప్రకాష్ అంబేద్కర్ ను తోడ్కొని ప్రగతి భవన్ నుంచి బయలుదేరిన సీఎం, హుసేన్ సాగర్ పక్కనే ఆవిష్కరణకు సిద్ధమైన అంబేద్కర్ మహా విగ్రహాన్ని ప్రకాశ్ అంబేద్కర్ చేతులమీదుగా ఆవిష్కరింపచేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన 125 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాంపై హెలికాప్టర్ ద్వారా గులాబీ పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఆ పూల వర్షాన్ని సీఎం కేసీఆర్, ప్రకాశ్ అంబేద్కర్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు వీక్షించారు. ఈ సందర్భంగా కేసీఆర్ జై భీమ్ అని నినదించారు. అక్కడున్న ప్రజాప్రతినిధులంతా చప్పట్లతో పూల వర్షాన్ని స్వాగతించారు.
అంబెడ్కర్ విగ్రహ స్థాపన మూలం..
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ టాంక్‌బండ్ సవిూపంలో 125 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లుసీఎం 2016లో ప్రకటించారు. దానికి అనుగుణంగా 2016 ఏప్రిల్ 14న ఎన్టీఆర్ పార్కు పక్కన 11.4 ఎకరాల విస్తీర్ణంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి భూమి పూజ కూడా చేశారు. 2017లో అప్పటి డిప్యూటీ
సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేల బృందం చైనాలో పర్యటించింది. పార్లమెంటు ఆకృతిలో నిర్మిస్తున్న బేస్‌మెంట్‌కు ఆగ్రా, నోయిడా, జైపూర్ తదితర ప్రాంతాల నుంచి తెప్పించిన ఎరుపు, గోధుమ రంగుల రాళ్లను ఉపయోగించారు. విగ్రహంలోని బూట్లు కాళ్లు, చేతులు, భారత రాజ్యాంగం పుస్తకం, భుజాలు, ముందుకు చూపుతున్నట్లు ఉండే కుడిచేయి, తల తదితరాలన్నింటినీ విడివిడి భాగాలుగా నోయిడాలో కంచుతో తయారుచేసి లారీల ద్వారా తరలించారు. విగ్రహం పటిష్టంగా ఉండేందుకు లోపలివైపు స్టీల్ స్ట్రక్చర్‌ను ఉపయోగించారు. విడివిడి భాగాల మొత్తం అమరిక పూర్తయిన తర్వాత పాలీ యూరేథీన్ కెమికల్స్‌తో పాలిషింగ్ చేశారు. టాంక్‌బండ్ నీటి కాలుష్యంతో పాటు గాలిలోని రసాయనాల, వాతావరణ మార్పులతో విగ్రహం షైనింగ్ తగ్గకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. అతి భారీ తుపానులను కూడా తట్టుకునేలా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.