ప్రభుత్వ ఆస్తుల అమ్మకమే ప్రధాని లక్ష్యంకేటీఆర్‌

నష్టాలను ప్రభుత్వాల పరం చేయడం, లాభాలను ప్రైవేటు సంస్థల పరం చేయడమే ప్రస్తుత ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. విశాఖ ఉక్కు విషయంలో చూపిస్తున్న శ్రద్ధ, బయ్యారం ఉక్కు విషయంలో ఎందుకు చూపించడం లేదని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రశ్నించడంపై కేటీఆర్‌ స్పందించారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ మంగళవారం విూడియా సమావేశం నిర్వహించారు. బండి సంజయ్‌ ఒక అజ్ఞాని అని, విషయాన్ని అర్థం చేసుకొనే పరిజ్ఞానం అతనికి లేదని ఎద్దేవా చేశారు. విశాఖ ఉక్కుకి, బయ్యారం స్టీల్‌ ప్లాంటుకి ముఖ్య సంబంధం బైలల్లా అనే ఐరన్‌ ఓర్‌ గనులు అని చెప్పారు. ఇవి ఛత్తీస్‌ గఢ్‌ నుండి ఒడిశా వరకూ విస్తరించి ఉన్న నాణ్యమైన ముడి ఇనుపఖనిజ గనులు అని, దాదాపు 1.34 బిలియన్‌ మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం ఉన్నదని తెలిపారు. బయ్యారం నుంచి 160 కిలో విూటర్ల దూరంలో బైలదిల్లా గనులు ఉన్నాయని, విశాఖ నుంచి 600 కిలో విూటర్ల దూరంలో ఉంటుందని చెప్పారు. ‘‘విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం బయ్యారంలో సెయిల్‌ (స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌) ద్వారా ఏర్పాటు చేస్తామని చెప్పారు. కడపలో కూడా సెయిల్‌ ద్వారానే ఏర్పాటు చేసే ఏర్పాటు చేస్తామని చట్టంలో చెప్పారు. బయ్యారం గురించి 2014 నుంచి కేంద్రాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాం. ఎన్నోసార్లు లేఖలు కేంద్ర మంత్రులకు రాశాము. నేను స్వయంగా 2018లో ప్రధానిని కలిసి కూడా బయ్యారం గురించి మాట్లాడా. బయ్యారం ఉన్న చోట ఐరన్‌ ఓర్‌ అనేది తక్కువ నాణ్యతగా ఉందని కొంత మంది కేంద్రాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. బైలదిల్లా నుంచి ఐరన్‌ ఓర్‌ బయ్యారానికి సరఫరా కోసం స్లరీ పైపు లైన్‌ ఏర్పాటు చేస్తే బావుంటుందని సూచించా. అందుకు అయ్యే ఖర్చు కూడా సగం భరిస్తామని ప్రధానికి 2018 జూన్‌ లో వివరించా. కానీ, దీని వెనుక ఒక కుట్ర జరుగుతుందని మేం అర్థం చేసుకోలేకపోయాం.’’ ఒక కుక్కను చంపాలంటే ముందు దానికి పిచ్చి కుక్క అనే ముద్ర వేయాలి. తర్వాత దాన్ని కాల్చి చంపితే ఎవ్వరూ ఏం అనరు. ఆ అజెండాలో భాగంగా 2018లో బైలదిల్లాలోని ఐరన్‌ ఓర్‌ను జపనీస్‌, కొరియా స్టీల్‌ మిల్లులకు సరఫరా చేయాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. స్వల్ప సమయంలోనే ‘అదానీ బైలదిల్లా ఐరన్‌ ఓర్‌ మైనింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ పెట్టారు. వెంటనే సదరు జపనీస్‌ స్టీల్‌ కంపెనీలతో ఒప్పందం ఏర్పాటు చేసుకొని గుజరాత్‌ లోని ముంద్రాలో స్టీల్‌ ప్లాంటు పెడతానని ప్రకటించారు. ‘‘ కేటీఆర్‌
‘‘ఒక్క బైలదిల్లాను ఆదానీకి కట్టబెట్టడం వల్ల రెండు తెలుగు రాష్ట్రాలు చావు దెబ్బతిన్నాయి. అందుకే బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టడం లేదు. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి కూడా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని చెప్పేశారు. అదానీకి ఇచ్చినంక ఇంకెట్ల సాధ్యమైతది. కుక్కను చంపేముందు పిచ్చి కుక్క అని ముద్రేసినట్లు విశాఖ ఉక్కుకు ముడి ఖనిజ గనులు కేటాయించకుండా.. కావాలని బలవంతంగా నష్టాల్లోకి నెట్టి, తక్కువ ధరకే ప్రైవేటు పరం చేస్తున్నారు. బైలదిల్లా నుంచి బయ్యారం 160 కి.విూ., విశాఖపట్నానికి 600 కి.విూ., గుజరాత్‌ లోని ముంద్రాకు 1800 కి.విూ., ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీలకు సాధ్యం కానిది ముంద్రాలోని ఫ్యాక్టరీలకు ముడి ఖనిజాన్ని తరలించడం ఎలా సాధ్యం అవుతుంది?’’ అని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *