తిరుపతి : ఒక దేశ అభివృద్ధిలో ప్రజల ఆరోగ్య సంరక్షణ, విద్య రెండు కీలకమైనవని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాలు మరియు పెట్రోలియం, సహజ వనరుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. మంగళవారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనానంతరం కేంద్ర మంత్రి కుటుంబ సభ్యులతో కలిసి టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం, బర్డ్ ఆసుపత్రులను సందర్శించారు.శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రి దేశానికే ఆదర్శమని ఆయన కొనియాడారు.
.శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రి వార్డుల్లో గుండె జబ్బులతో చికిత్స పొందుతున్న చిన్నారులను, క్యాథ్ల్యాబ్, ఐసీయూ తదితర వార్డులను మంత్రి సందర్శించి, రోగుల తల్లిదండ్రులతో మాట్లాడారు.
నిరుపేదలకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు చేసి బాలింతలకు, చిన్నారులకు టీటీడీ అందిస్తున్న సేవల పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అనంతరం బర్డ్ ఆసుపత్రిని సందర్శించి, నిరుపేదలకు ఉచితంగా మోకాలి కీళ్ల మార్పిడి మరియు ఇతర ఎముకల సంబంధిత వ్యాధులకు అందుతున్న చికిత్సలను పరిశీలించారు.
అనంతరం మంత్రి విూడియాతో మాట్లాడుతూ, శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రి, బర్డ్ ఆసుపత్రులలో టీటీడీ అందిస్తున్న సేవలు అద్భుతమని, ముఖ్యంగా పీడియాట్రిక్ కార్డియాక్ ఆసుపత్రిలో అంకితభావంతో సేవలు అందిస్తున్న వైద్యులు మరియు పారా మెడికల్ సిబ్బందిని అభినందించారు. అదేవిధంగా ఆస్పత్రి ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వ చొరవను కూడా’’ మంత్రి ప్రశంసించారు.
కోవిడ్ కష్టకాలంలో కూడా, టీటీడీ ఆధ్వర్యంలో బర్డ్ ఆసుపత్రి కోవిడ్ కేర్ సెంటర్గా పని చేసినట్లు తెలిసిందన్నారు.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యొక్క సమర్థ నాయకత్వంలో భారతదేశం కోవిడ్ క్లిష్ట పరిస్థితులను అధిగమించి నేడు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. 224 కోట్ల వ్యాక్సినేషన్లను భారతదేశం ప్రస్తుతం తయారు చేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈఓ ధర్మా రెడ్డి, జేఈవో సదా భార్గవి, చిన్న పిల్లల ఆసుపత్రి డైరెక్టర్ డా. శ్రీనాథ్ రెడ్డి,డాక్టర్ గణపతి, బర్డ్ వైద్యులు డాక్టర్ రామూర్తి, డాక్టర్ ప్రదీప్, డాక్టర్ వేణుగోపాల్, ఈఈ కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.