న్యూఢల్లీ : రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము తో వైసీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య బీసీ సంఘాల నేతలు జి.కృష్ణ, లాల్ కృష్ణ, నీల వెంకటేష్ తదితర నేతలతో , మంగళవారం భేటీ అయ్యారు. అనంతరం ఆర్.కృష్ణయ్య విూడియాతో మాట్లాడుతూ… రాజ్యాంగంలోని 340 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి హోదాలో జోక్యం చేసుకోవాలని కోరామన్నారు. రాజ్యాంగం ప్రకారం విద్యా, ఉద్యోగ, ఆర్ధిక, రాజకీయ, సామాజిక రంగాల్లో బీసీలకు వాటా, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటుకు చొరవ తీసుకోవాలని రాష్ట్రపతిని కోరినట్లు చెప్పారు. బీసీలకు రావాలసిన వాటా కోసం మరోసారి అధ్యయనం జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. బీసీలకు అన్నీ రంగాల్లో సమాన వాటా ఇచ్చే ప్రక్రియ ప్రారంభమయిందనీ, ఇంకా పూర్తి స్థాయి న్యాయం చేయడం కోసం చర్యలు తీసుకుంటామని రాష్ట్రపతి హావిూ ఇచ్చినట్లు ఆర్ కృష్ణయ్య తెలిపారు. ఏపీలో బీసీల అభివృద్ధికి, విధ్యార్ధుల కోసం జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెడుతున్న ఫథకాలను రాష్ట్రపతికి వివరించినప్పుడు, ఆమె సీఎం జగన్ మోహన్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారని ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు.