
సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు కుటుంబాన్ని డా. మోహన్ బాబు పరామర్శిస్తూ, తమ మధ్య ఉన్న స్నేహాన్ని గుర్తుచేసుకున్నారు. Dr. Mohan Babu visited the bereaved family of veteran actor Kota Srinivasa Rao and recalled their long-standing association.
టాలీవుడ్ అగ్రనటుల్లో ఒకరైన కోట శ్రీనివాసరావు ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో, నటుడు డా. మోహన్ బాబు ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… “కోట నాకు అత్యంత ఆప్తుడు. ఆయన అకాల మరణం నన్నెంతో కలిచివేసింది. ఆ రోజున నేను హైదరాబాద్‌లో లేను. అందుకే ఈ రోజు వారి కుటుంబాన్ని కలిసి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశాను” అని తెలిపారు.
మోహన్ బాబు మాట్లాడుతూ, “1987లో నా బ్యానర్లో వచ్చిన ‘వీరప్రతాప్’ సినిమాలో కోటకు మాంత్రికుడి పాత్ర ఇచ్చాను. తర్వాత మా బ్యానర్‌తో పాటు ఇతర బ్యానర్లలోనూ కలిసి ఎన్నో చిత్రాలు చేశాం. విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన స్వరాన్ని, మాడ్యులేషన్‌ను బాగా ఉపయోగించుకునే నటుడు కోట. సినిమాల్లో ఆయన పాత్రల దృష్టితో కాకుండా, ఆయన మనిషిగా మా కుటుంబానికి ఎంతో దగ్గర. ఆయన మృతి మా కుటుంబానికే కాకుండా చిత్ర పరిశ్రమకూ తీరని లోటు” అని అన్నారు.
కోట శ్రీనివాసరావు, కన్నప్ప చిత్రం విడుదల రోజున తనకు ఫోన్ చేసి “సినిమా బాగా వచ్చింది, విష్ణుకు మంచి పేరు వచ్చింది” అని చెప్పారు అని మోహన్ బాబు గుర్తు చేసుకున్నారు. కోట ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి మనశ్శాంతి లభించాలని ఆయన ఆకాంక్షించారు.