చేనేత కార్మికులను ఆదుకోవాలి
జాతీయ చేనేత ఐక్యవేదిక సంగం డిమాండ్‌
బద్వేలు


కరోనా కారణంగా కుదేలైన చేనేత పరిశ్రమకు రాయితీలు కల్పించి, చేనేత కార్మికులను ఆదుకోవాలని జాతీయ చేనేత ఐక్యవేదిక సంఘం జాతీయ అధ్యక్షులు అవ్వారు మల్లికార్జున ,రాష్ట్ర అధ్యక్షులు నీలూరి రుసింగప్ప లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు, వారు మంగళవారం చీరాల నియోజకవర్గంలోని చీరాల, వేటపాలెం మండలాల్లో ని 10 గ్రామాలలో పర్యటించి చేనేత కార్మికుల స్థితిగతులను, సాధక బాధకాలను తెలుసుకున్నారు. చేనేత కార్మికులను పరామర్శించి చేనేత వృత్తిలో ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీశారు .వారి దృష్టికి వచ్చిన చేనేత సమస్యలపై బాపట్ల జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌, మంగళగిరిలోని చేనేత మరియు జోలి శాఖ కమిషనర్‌ నాయక్‌ లను కలిసి వినతి పత్రం అందజేసి చేనేత పరిశ్రమను ,కార్మికులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.చేనేత కార్మికులకు రుణమాఫీ చేయడంతో పాటు 11 రకాల చేనేత వస్త్రాలపై రిజర్వేషన్‌ యాక్టు నుకఠినంగా అమలు చేయాలని ,పవర్‌ లూమ్స్‌ పై చేనేత వస్త్రాల తయారీని అడ్డుకట్ట వేసి ఎన్ఫోర్స్మెంట్‌ ద్వారా క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.పవర్‌ లూమ్స్‌ ద్వారా ఉత్పత్తి చేసిన చీరలను చేనేత చీరలుగా విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. చేనేత సహకార సంఘాల వద్ద ఉన్న చేనేత వస్త్రాలకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించాలని, సబ్సిడీపై ముడి సరుకులు అందించాలని కోరారు. నేతన్న నేస్తం పథకాన్ని చేనేత పరిశ్రమ అనుబంధ రంగాల కార్మికులకు కూడా వర్తింపజేయాలని, చేనేత వస్త్రాలపై పూర్తిగా జిఎస్టీరద్దు చేయాలని పేర్కొన్నారు .కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్‌ హెచ్‌ డిసి పథకం ద్వారా పాస్‌ పుస్తకాలు మంజూరు చేసి ,నేరుగా కార్మికులకు నూలు,పట్టు రాయితీ అందించి ,హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పథకం ప్రవేశ పెట్టాలన్నారు. ఉచిత విద్యుత్‌ తో పాటు, గుర్తింపు కార్డులు కూడా అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ చేనేత ఐక్యవేదిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లింగం రామచంద్ర, కేరళ ఇన్చార్జి యం .ఇస్మాయిల్‌ రాష్ట్రఆర్గనైజింగ్‌ సెక్రటరీ శీలం వెంకటేశ్వర్లు, మహిళా అధ్యక్షురాలు ఉద్దంటి ఆదిలక్ష్మి, చేనేత నాయకులు తారక రామారావు ,పురుషోత్తం ,హేమ సుందర్‌ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *