ఝార్ఖండ్‌ లో భారీ ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలతో సహా ఐదుగురు హతం.. ఇద్దరు అగ్రనేతల తలపై 25 లక్షల రివార్డు ఉందని తెలుస్తోంది…

ఝార్ఖండ్‌ రాష్ట్రంలో ఛత్రా జిల్లాలోని అటవీ ప్రాంతంలో రక్తం పారింది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోలు హతమయ్యారు. వీరిలో మావోయిస్ట్ పార్టీ అగ్రనేత, స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడు గౌతమ్ పాశ్వాన్ కూడా ఉన్నట్టు తెలిపారు. పలు దాడుల్లో నిందితుడిగా ఉన్న గౌతమ్ పాశ్వాన్ తలపై రూ.25 లక్షల రివార్డు ఉంది. ఛత్రా-పాలము సరిహద్దు ప్రాంతంలో మావో అగ్రనేతలు సమావేశమైనట్టు సమాచారం అందుకున్న పోలీసులు.. కూంబింగ్ చేపట్టారు. ఘటనా స్థలిలో రెండు ఏకే 47 రైఫిల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని, పూర్తి వివరాలను తర్వాత వెల్లడిస్తామని ఝార్ఖండ్ పోలీసులు చెప్పారు. ఛత్రా- పాలము సరిహద్దుల్లో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకున్నట్టు విశ్వసనీ వర్గాలు తెలిపాయి.
మరోవైపు, ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్ట్ ప్రభావం ఉన్న కాంకేర్ జిల్లాలో ముగ్గురు నక్సల్స్‌ను డీఆర్జీ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. అరెస్టైన మావోయిస్ట్‌లను సుమంద్ అలియాస్ సుమన్ సింగ్ అంచాలా (42), సంజయ్ కుమార్ ఉసెందీ (27), పరాశ్రమ్ ధంగుల్ (55)గా గుర్తించారు. కోయెలిబెడా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మావోల ఉనికిపై సమాచారం రావడంతో పోలీసులు కూంబింగ్ చేపట్టి ముగ్గుర్ని అరెస్ట్ చేశారని అనంత్‌గఢ్ అదనపు ఎస్పీ ఖోమన్ సిన్హా తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *