భద్రాచలం: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన రాములోరి కల్యాణోత్సవం కనులపండువగా సాగింది. అభిజిత్ లగ్నంలో జగన్మాత సీతమ్మ మెడలో శ్రీరామచంద్రుడు మాంగల్య ధారణ చేశారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. దేవదేవుడికి కల్యాణాన్ని భక్తజనం కనులారా వీక్షించి పులకించింది. మిథిలా మైదానంలో కిక్కిరిసిన భక్తజనసందోహం మధ్య త్రిదండి చినజీయస్వామి సమక్షంలో అర్చకులు కల్యాణ క్రతువును పూర్తిచేశారు. భక్తుల రామనామస్మరణ మధ్య జానకమ్మను జగదభిరాముడు మనువాడారు. ఉదయం 8 గంటల నుంచి 9గంటల వరకు ప్రధానాలయంలో మూలవిరాట్‌కు సంప్రదాయబద్ధంగా కల్యాణం నిర్వహించారు. ఆ తర్వాత కల్యాణమూర్తులను ఊరేగింపుగా మిథిలా మండపానికి తీసుకువచ్చారు. అక్కడ విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కన్యావరుణ పూజలు నిర్వహించారు. సీతారాముల వారి గోత్రనామాలను పఠిస్తూ ప్రవర క్రతువును కొనసాగించారు. సీతమ్మవారికి యోక్త్రధారణ చేశారు. రాములవారికి యజ్ఞోపవీతధారణ నిర్వహించారు. అభిజిత్ లగ్నం సమీపించడంతో మధ్యాహ్నం 12గంటలకు సీతారాముల వారి శిరస్సులపై జీలకర్ర బెల్లం ఉంచి మంత్రోచ్ఛరణ చేశారు. కల్యాణ పరమార్థాన్ని వివరిస్తూ చూర్ణిక అనే వేడుక నిర్వహించారు. అనంతరం మాంగల్యధారణ అంగరంగ వైభవంగా జరిగింది.
ధర్మం ఆకారం దాల్చితే ఆయనే శ్రీరాముడు: చినజీయర్ స్వామి : ఈ సందర్భంగా చిన జీయర్ స్వామి మాట్లాడుతూ.. ధర్మం ఆకారం దాల్చితే ఎలా ఉంటుందో ఆయనే శ్రీరాముడని చెప్పారు. మనుషుల్లో మనిషిగా ఉండి మనకు ధర్మం నేర్పారన్నారు. ప్రజల కష్టసుఖాలను పాలకులు గుర్తిస్తే ఆ దేశం రామరాజ్యం అవుతుందని చెప్పారు. ఇది శోభకృత్ నామ సంవత్సరమని.. త్రేతా యుగంలో సీతాదేవి జన్మించిన ఏడాది ఇదేనని వివరించారు. శ్రీరామ నవమి వేడుకలకు సుమారు లక్ష మంది భక్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. 70 కౌంటర్లలో ఉచిత కల్యాణ తలంబ్రాలను పంపిణీ చేస్తున్నారు. 19 కౌంటర్లలో లడ్డూ ప్రసాదాలు అందజేస్తున్నారు.