700 కి.మీ మైలురాయికి చేరుకున్న లోకేష్‌ పాదయాత్ర


శ్రీసత్యసాయిజిల్లా: టీడీపీ యువనేత నారాలోకేష్‌ యువగళం పాదయాత్ర విజయవంతగా కొనసాగుతోంది. యువగళం పాదయాత్ర 700 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. గురువారం ఉదయం పెనుకొండ నియోజవర్గంలో 55వ రోజు పాదయాత్రను లోకేష్‌ ప్రారంభించారు. అక్కడి నుంచి కియా పరిశ్రమను పరిశీలించి… పరిశ్రమ ముందు లోకేష్‌ సెల్ఫీఛాలెంజ్‌ విసిరారు. అనంతరం పాదయాత్ర గుట్టూరు గ్రామంలోకి ప్రవేశించింది. దీంతో యువగళం ప్రభంజనమై 700 కిలోమీటర్ల మైలురాయిని గుట్టూరు గ్రామంలో పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ… ఈ మైలురాయి గోరంట్ల మండలం మరియు మడకశిర ప్రాంతాల తాగు, సాగునీటి సమస్యల శాశ్వత పరిష్కారానికి పునాది కానుందని అన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక హంద్రీనీవా కాలువ నుంచి ఎత్తిపో తల పథకం ఏర్పాటు చేస్తామని లోకేష్‌ హామీ ఇచ్చారు. అంతకు ముందు… కియా పరిశ్రమ ముందు లోకేష్‌ సెల్ఫీ చాలెంజ్‌ విసిరారు. అప్పటి ప్రభుత్వంలో అనేక పరిశ్రమలను తీసుకువచ్చామని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం ప్రజలకు సేవ చేసిందే తప్ప.. చేసిన అభివృద్ధి పనులను చెప్పుకోలేకపోయామని.. అందుకే ప్రజలు అలాంటి ఫలితాలు ఇచ్చారన్నారు. పాదయాత్రలో దారి వెంబడి వెళ్తుండగా ఉన్న పరిశ్రమల ముందు ఆగి లోకేష్‌ సెల్ఫీ తీసుకుంటూ ప్రజలకు తెలియజేస్తున్నారు. వైసీపీ సర్కార్‌ది విధ్వంస పాలన అని విమర్శించారు. అభివృద్ధి చేయాలన్న తలంపు ఏకోశాన జగన్‌కు సర్కార్‌కు లేదని అన్నారు. తాము చేసిన అభివృద్ధి ప్రత్యక్షంగా కనిపిస్తోంది. కియా పరిశ్రమ రావడం చంద్రబాబు ఘనతే అని చెప్పుకొచ్చారు. అధికారం చేపట్టిన తొలినాళ్లలో ప్రజావేదిక కూల్చివేతతో వైఎస్‌ జగన్‌ పరిపాలనను ప్రారంభించారన్నారు. అన్ని పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెళ్లడమే కానీ కొత్తగా పరిశ్రమలు వచ్చిన దాఖలాలు లేవన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *