మెదక్ : విజ్ఞానం పెంపొందించడంలో గ్రంథాలయాలు కీలక భూమిక పోషిస్తున్నాయి. గ్రంథాలయాలను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం, స్థానిక సంస్థలు కొన్నేళ్లుగా నిర్లక్ష్యం చేయడంతో వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. కొన్నేళ్లుగా గ్రంథాలయా లకు రావాల్సిన సెస్‌ను ప్రభుత్వ శాఖలు చెల్లించడం లేదు. ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తున్నా… అందులో గ్రంథాలయాలకు చెల్లించాల్సిన 0.08 శాతం సెన్‌ను అందించడం లేదు. ఫలితంగా పుస్తకాలు, స్టేషనరీ కొనుగోళ్లు, పత్రికలు, విద్యుత్ బిల్లులు, స్వీపింగ్ చార్జీలు, సిబ్బంది వేతనాలతో పాటు మెయింటనెన్స్‌కు నిధులు సరిపోక ఆర్థిక ఇబ్బందులతో గ్రంథాలయాలు కొట్టుమిట్టాడుతున్నాయి. ఉద్యోగాలకు సిద్ధమయ్యే వాళ్లు గ్రంథాలయాలకు వస్తున్నా.. వారికి కావాల్సిన పుస్తకాలు అందుబాటులో ఉండడం లేదు. గ్రంథాలయాల నుంచి ఎన్ని విజ్ఞప్తులు వచ్చినా సెస్ చెల్లింపుల విషయంలో గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల నుంచి సరైన స్పందన రావడం లేదు. మెదక్ జిల్లాలో 16 గ్రంథాలయాలుమెదక్ జిల్లాలో 16 గ్రంథాలయాలున్నాయి. అందులో జిల్లా కేంద్రంతో పాటు 13 గ్రంథాల యాలకు సొంత భవనాలు ఉన్నాయి. గ్రంథాలయాల నిర్వహణకు సర్కారు నుంచి ఎలాంటి నిధులు రావడం లేదు. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో ప్రజల నుంచి వసూలయ్యే పన్నుల్లోంచి ప్రతియేటా చెల్లించే 8శాతం సెస్ నిధులతోనే గ్రంథాలయాల నిర్వహణ కొనసాగుతున్నది. సెస్ రూపంలో చెల్లించే నిధులను అడిట్‌లో కూడా ఆయా శాఖలు సూచించాల్సి ఉంటుంది. ఇటివల కొంత చెల్లించిన ప్పటికీ మూడేళ్ల నుంచి మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలు స్పందించని పరిస్ధితి. దాంతో జిల్లా గ్రంథాలయాలు నిర్వహణ భారంగా మారుతోందని గ్రంథపాలకులు పేర్కొంటున్నారు.రూ. 2.88కోట్ల బకాయిలుకొత్త జిల్లాలు ఏర్పాటైన తర్వాత స్థానిక సంస్థలకు వివి ధ పథకాల ద్వారా నిధులు విడుదలవుతున్నాయి. మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో పన్నుల వసూళ్ల ప్రక్రియ పకడ్భందీగా చేపడుతు న్నారు. ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ చివరి వరకు 80శాతానికి పైగా వసూలు చేస్తున్నారు. వసూలు చేసిన పన్నుల్లో 0.08 శాతం సెస్ కూడా అదే రోజు జిల్లా గ్రంథాలయాల సంస్థ ఖాతాకు బదిలీ చేయాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. జిల్లాలోని మెదక్ మున్సిపాలిటీ నుంచి రూ.84,05,891, తూప్రాన్‌లో రూ.15,74,595, నర్సాపూర్‌లో రూ.11,02,300, రామాయంపేట లో రూ7,63,494తో పాటు, జిల్లావ్యాప్తంగా ఉన్న 469 గ్రామపంచాయతీల నుంచి రూ.1,70,31,566 సెస్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. మొత్తం రూ. 2,88,31,566 వరకు ఉంది. విధిగా సెస్ చెల్లించాలి – చంద్రాగౌడ్, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్, మెదక్‌స్థానిక సంస్థలు ప్రజల నుంచి వసూలు చేసే పన్నుల్లోంచి 0.08 శాతం సెస్ రూపంలో గ్రంథాలయాల సంస్థకు విధిగా చెల్లించాలి. ప్రస్తుతం నోటిఫికేషన్లు వెలువడిన నేపథ్యంలో పేద విద్యార్థులు చదువుకోవడానికి గ్రంథాలయాలకు వస్తున్నారు. వారికి అవసరమైన పుస్తకాలు కొనుగోలు చేయాలంటే నిధులు లేక ఇబ్బందులు పడుతున్నాం. జిల్లా గ్రంథాలయ సంస్థకు గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల నుంచి రావాల్సిన సెస్ సక్రమంగా వసూలు కావడం లేదు.బకాయిలు పేరుకుపోయాయి. ఈ విషయమైన జిల్లా అదనపు కలెక్టర్, డీపీవోలకు విజ్ఞప్తి చేశాం.