ఉదయనిధి స్టాలిన్… సినిమా నటుడు, నిర్మాత. అంతకు మించి డీఎంకే అధినేత స్టాలిన్ కొడుకు. తమిళనాడులో యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖ మంత్రి. తండ్రి ముఖ్యమంత్రి అయితే కొడుకు క్యాబినెట్‌లోకి రావడానికి వేరే అర్హతలు అవసరం లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటివి కొత్త కాదు. ఈ మధ్య అతను దేశవ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యాడు. ఈ విషయంలో తండ్రి పాత్ర ఇసుమంతైనా లేదు. సనాతన ధర్మాన్ని పూర్తిగా నిర్మూలించాంటూ వివాదాస్పద వ్యాఖ్యలతో ఆయన ఓవర్ నైట్ నేషనల్ స్టార్ అయిపోయాడు. ఈ అదృష్టం ఎక్కడో నూటికో కోటికో ఒకరికే పడుతుంది ఉదయనిధి ఎంతలా ‘ఎదిగి’ పోయాడంటే.. కేంద్ర క్యాబినెట్ భేటీలో ప్రధానమంత్రి కూడా స్వయంగా స్పందించేంత. ఇక మరో డీఎంకే నేత రాజా అయితే సనాతన ధర్మాన్ని ఎయిడ్స్ పోల్చాశాడు… వీరద్దిరి వ్యవహారంతో బీజేపీకి తంతే బూరెల బుట్టలో పడినట్టయింది. ‘సనాతన’ అంశాన్ని వదలొద్దంటూ మోదీ తన మంత్రివర్గ సహచరులకు దిశా నిర్దేశం చేసేంతగా! ఈ విషయంపై ఎంత రచ్చ అయితే భీజేపీకి అంత మంచిది. తమిళనాడులో కూడా ‘హిందూ’ భావోద్వేగాలను రెచ్చ గొడితే అక్కడ అంత తొందరగా పాగా వేయవచ్చనేది మోదీ అండ్ టీమ్ ప్లాన్. దక్షిణాది కమలం పార్టీకి కొరకరాని కొయ్యగా తయారైంది. ఉన్న కర్ణాటకలో కూడా ఈ మధ్యే అధికారం హరీ అంది. హిందూ ఓట్ల గంపగుత్తగా తమకే పడాలని ఆరెస్సెస్, భాజపా ఆలోచన. కుర్ర స్టాలిన్ వ్యాఖ్యలు కేంద్రంలో అధికార పార్టీకి ఆక్సిజన్ అందించాయి. తమిళనాడు ఓ విచిత్రమైన రాష్ట్రం. అక్కడ పెరియార్, అన్నాల ఆలోచన విధానం ఉంటుంది. అక్కడే పరువు హత్యలు కూడా ఉంటాయి. అక్కడే కుల వివక్ష ఉంటుంది,. నాలుగు దశా బ్దాలుగా డీఎంకే, అన్నా డీఎంకే మాత్రమే అధికారాన్ని పంచుకుంటున్నాయి. వెనువెంటనే రెండో సారి అధికారంలోకి వచ్చిన పార్టీ అన్నా డీఎంకే మాత్రమే. ఆ రెండు సార్లూ ముఖ్యమంత్రులను కోల్పోయిన దురదృష్టం కూడా ఆ పార్టీదే. ఎంజీయార్, జయలలిత వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి, అధికారంలో ఉండగానే మరణించారు. ఈ ప్రాంతీయ పార్టీల హవాలో కాంగ్రెస్ తన ఉనికిని ఎప్పుడో కోల్పోయింది. భాజపా తమిళనాట జెండా పాతడానికి ఉవ్విళ్ళూరుతోంది ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై ఉదయనిధి మరింత దృఢంగా నిలబడ్డారు. ఆయనకు అనుకూలంగా కూడా మరి కొందరు మాట్లాడుతున్నారు. కానీ కాంగ్రెస్ ఈ వివాదం నుంచి తప్పించుకోడానికి ప్రయత్నిస్తోంది. కర్ణాటకలోని కాంగ్రెస్ మంత్రి మాత్రం ‘సనాతన ధర్మం’ నిర్మూలన వ్యాఖ్యలను సమర్ధించారు. ఉత్తరాదికి చెందిన ఓ మఠాధిపతి ఉదయనిధి తల తెచ్చినవాళ్ళకు పదికోట్లు ఇస్తానని చెప్పడం వివాదాస్పదమైంది. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా, అనుకూలంగా సోషల్ విూడియా హోరెత్తుతోంది ఈ రచ్చే భాజపాకు కావాలి. హిందూ ఓట్లు పోలరైజ్ అవ్వాలి. నూరు లక్షల కోట్ల అప్పు, పెరుగుతున్న ధరలు, నిరుద్యోగిత నుంచి ప్రజల దృష్టిని భావోద్వేగాల వైపు మళ్లించాలి. రాబోయే ఎన్నికల్లో ప్రతి రాష్ట్రంలో భాజపా ఉదయనిధి వ్యాఖ్యలపై మాత్రమే మాట్లాడుతుంది. అక్కడ నుంచి హిందూ ఓట్లను దండుకుంటుంది. దీనివల్ల జూనియర్ స్టాలిన్ కొన్నాళ్లు విూడియా లైమ్‌లైట్‌లో ఉంటాడు. ప్రధానమంత్రి సమావేశాన్ని ఏర్పాటు చేసి నన్ను అనుమతిస్తే, క్యాబినెట్ మంత్రులందరికీ సమాధానాలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. విూరు నిర్ణయించిన తర్వాత ‘సనాతన ధర్మం’ ఏది అని నేను వివరిస్తాను.’ అని రాజా అన్నారు. పుదుచ్చేరిలో మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాజ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను సమర్ధించారు. దీనిపై అమిత్ షా లేదా ఇతర బీజేపీ ముఖ్య నేతలు ఎవరైనా తనతో చర్చకు రావాలని సవాల్ విసిరారు.సనాతన ధర్మం ప్రజల మధ్య అసమానతలను ప్రోత్సహించిందని, మహిళల హక్కులను అరికట్టిందని అన్నారు. భర్త మరణిస్తే అతడి చితిపై కూర్చుని భార్య ప్రాణత్యాగం చేసే సతీసహగమనాన్ని సమర్దించిందని అన్నారు. ‘అటువంటి పద్ధతులను పునరుద్ధరించాలనుకుంటున్నారా? మనం అన్ని అసమానతలతో పోరాడాం.. ఈ సనాతన ధర్మాన్ని అంగీకరిస్తే.. మనం పెరియార్ (ద్రవిడ కజగం వ్యవస్థాపకుడు ఈవీ రామసామి), అన్నా (తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి సీఎన్ అన్నాదురై), కలైంజ్ఞర్ (కరుణానిధి) సూచించిన సూత్రాలకు వ్యతిరేకం. ఈ ధర్మాన్ని అంగీకరించడం వల్ల తోటి మానవులకు మనల్ని శత్రువులుగా మారుస్తారు, నేను ఈ ధర్మాన్ని అంగీకరిస్తే నేను మనిషిని కాదు’ అని రాజా ఉద్ఘాటించారుకానీ ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ‘ఇండియా’ మాత్రం ఇబ్బంది పడుతుంది. ఉదయనిధి వల్ల ‘ఇండియా బ్లాక్’కు వచ్చే నెగటివ్ ఓట్ తమిళనాడులోనే కాకుండా దేశమంతా ప్రతిఫలించాలని భాజపా భావిస్తోంది. అదే కనుక జరిగితే… కేంద్రంలో భాజపా గెలుపు నల్లేరు విూద నడకే. అటు తిరిగి.. ఇటు తిరిగి.. ఉదయనిధి స్టాలిన్, మాజీ మంత్రి రాజా ‘ఇండియా’ పుట్టి ముంచేలా ఉన్నారు.