హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఈ నెల 30వ తేదీన శ్రీరామనవమిని పురస్కరించుకొని శోభాయాత్ర చేపట్టనున్నారు. రామనవమి శోభాయాత్రకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళ్‌హాట్‌కు సమీపంలోని సీతారాంబాగ్ ఆలయం నుంచి ఉదయం 9 గంటలకు శోభాయాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్ర రాత్రి 7 గంటలకు కోఠిలోని హనుమాన్ వ్యాయామశాలకు చేరుకోనుంది. ఈ నేపథ్యంలో యాత్ర కొనసాగే మార్గంలో ఉన్న మసీదులు, దర్గాలను బట్టలతో మూసేశారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
శోభాయాత్ర కొనసాగే మార్గం.. బోయిగూడ కమాన్, మంగళ్‌హాట్ పోలీసు స్టేషన్ రోడ్, జాలి హనుమాన్, ధూల్‌పేట, పురానాపూల్ రోడ్, గాంధీ విగ్రహం, జుమ్మెరాత్ బజార్, బేగంబజార్ ఛత్రీ, సిద్ధంబర్ బజార్, శంకర్ షేర్ హోటల్, గౌలిగూడ చమాన్, పుత్లిబౌలి క్రాస్ రోడ్స్, కోఠి, సుల్తాన్ బజార్ మీదుగా హనుమాన్ వ్యాయామశాలకు శోభాయాత్ర చేరుకోనుంది. శోభాయాత్ర మార్గంలో పోలీసులు సీసీటీవీ కెమెరాలను అమర్చారు. పోలీసులను కూడా భారీగా మోహరించనున్నారు.