తొర్రూరు(జనగామ) : ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ పల్లెలు ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి చెందాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గ్రామ పంచాయతీల చరిత్రలో తెలంగాణ పల్లెలు దేశానికి పట్టుగొమ్మలుగా మారాయని పేర్కొన్నారు. తొర్రూరు మండలం చింతలపల్లి, సోమారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కొత్త పంచాయతీరాజ్ చట్టం రావడంతోపాటు, 3,146 గూడాలు, తండాలు కొత్తగా గ్రామ పంచాయతీలయ్యాయని వెల్లడిరచారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితో కేంద్ర ఫైనాన్స్ కమిషన్ నిధులకు సమానంగా రాష్ట్ర నిధులు అందడంతో పల్లెలు అనతికాలంలోనే అభివృద్ధిని సాధించాయని తెలిపారు. ఒక్కో గ్రామానికి కోటికిపై నిధులు అందినట్లు మంత్రి వివరించారు. ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం వల్ల శాశ్వత ప్రాతిపదికన గ్రామాల్లో పనులు జరిగాయని వివరించారు. నిరుద్యోగ యువత కోసం ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దక్కే విధంగా ఉచిత శిక్షణ, జాబ్ మేళా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడిరచారు. పాలకుర్తి నియోజకవర్గంలో 10 వేల మందికి కుట్టు శిక్షణ ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి సతీమణి, ఎర్రబెల్లి ట్రస్టు చైర్ పర్సన్ ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు, ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు.