ఏప్రిల్‌ 3 నుంచి టెన్త్‌ ఎగ్జామ్స్‌… ఉదయం 9:35 గంటల వరకు మాత్రమే అనుమతి


హైదరాబాద్‌ : రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పరీక్షలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతాయని, 9:35 గంటల వరకు మాత్రమే విద్యార్థులను అనుమతిస్తామని మంత్రి స్పష్టం చేశారు. పది పరీక్షల హాల్‌ టికెట్లను ఇప్పటికే ఆయా పాఠశాలలకు పంపించామని, వెబ్‌సైట్‌ నుంచి కూడా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు.
విద్యార్థులు తమ హాల్‌ టికెట్‌ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చని సూచించారు. ఏప్రిల్‌ 3 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించే పదో తరగతి పరీక్షలపై జిల్లా కలెక్టర్లతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిం చారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. పది పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి, ఆందోళనకు లోను కాకుండా సంసిద్ధం కావాలని సూచించారు. పరీక్షలపై విద్యార్థులకు ఉన్న సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసి, వారిలో మనోధైర్యాన్ని నింపాల్సిన బాధ్యత ఆయా యాజమాన్యాలతో పాటు ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు ఉందన్నారు. లక్షలాది మంది విద్యార్థులు హాజరవుతున్న పది పరీక్షలను పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *