బీఆర్‌ఎస్‌ నయా ఫార్ములా… క్యాడర్‌ను ఏకతాటి పై తెచ్చేందుకు పక్క ప్రణాళిక

హైదరాబాద్‌ : హ్యాట్రిక్‌ కొట్టాలనే పట్టుదలతో ఉన్న గులాబీబాస్‌ అందుకోసం మునుగోడు ఫార్ములాని ఫాలో అవుతున్నారా? అక్కడ ఆత్మీయ సమ్మేళనాల ప్లాన్‌ వర్కౌట్‌ కావడంతో.. అదే వ్యూహాన్ని కంటిన్యూ చేయాలని డిసైడ్‌ అయ్యారా? ఆత్మీయ సమ్మేళనాలతో అసంతృప్తి వాదులను ఏకతాటిపైకి తెస్తారా? ఆ సమ్మేళనాలతో గ్రూప్‌ రాజకీయాలకు చెక్‌ పడుతుందా? అనే మరిన్ని విషయాలను తెలుసుకుందాం..

ఏప్రిల్‌ 29 నాటికి పూర్తి కావాలని ఆదేశం : బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పార్టీని ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటి నుంచే ప్రజల్లో ఉండేలా కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలను జరపాలని.. ఏప్రిల్‌ 29 నాటికి ఆ సమ్మేళనాలు పూర్తి కావాలని నేతలను ఆదేశించారు. ఆత్మీయ సమ్మేళనాలను సమన్వయం చేసేందుకు జిల్లాల వారీగా ఇంచార్జిలను కూడా నియమించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌.. పార్టీ శ్రేణులకు ఓ సందేశాన్ని పంపారు. ఆ సందేశాన్ని పార్టీ ముఖ్యనేతలు కార్యకర్తలకు చదివి వినిపించాలని సూచించారు.
25న నియోజకవర్గ స్థాయిలో పార్టీ ప్రతినిధుల సమావేశం : పట్టణాల్లో నాలుగైదు వార్డులు లేదా డివిజన్లు కలిపి ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఏప్రిల్‌ 20 నాటికి మండలాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలను పూర్తి చేసుకుంటే..
25వ తేదీన నియోజకవర్గ స్థాయిలో పార్టీ ప్రతినిధుల సమావేశం నిర్వహించనున్నారు. నియోజకవర్గంలో జరిగే పార్టీ ప్రతినిధుల సమావేశంలో 1000 నుంచి 1500 మందితో సమావేశాలు ఉండే విధంగా ప్లాన్‌ చేశారు. ఇక.. ఏప్రిల్‌ 27న పార్టీ ప్లీనరీ సమావేశం జరగనుంది. ఈ ప్లీనరీ సమావేశానికి పార్టీ ఆహ్వానించిన ప్రతినిధులు హాజరవుతారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్‌ 27న రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి వార్డులో, ప్రతి గ్రామంలో జెండా పండుగ కార్యక్రమాన్ని బీఆర్‌ఎస్‌ పార్టీ ఘనంగా నిర్వహించబోతుంది. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణపై వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక దృష్టి పెట్టి పర్యవేక్షిస్తున్నారు. ఆత్మీయ సమ్మేళనాల సక్సస్‌ కోసం ఎప్పటికప్పుడు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు.
గ్రూప్‌ రాజకీయాలకు చెక్‌ పెట్టొచ్చనే ఆలోచన : మునుగోడు ఉప ఎన్నికల సమయంలో అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించింది. సామాజిక వర్గాల వారీగా సమ్మేళనాలను ఏర్పాటు చేశారు. ఈ ఉప ఎన్నికల్లో గెలుపునకు ఆత్మీయ సమ్మేళనాల ఫార్ములానే కలసి వచ్చిందని బీఆర్‌ఎస్‌ అధిష్టానం భావిస్తోంది. ఆ తర్వాత ఖమ్మంలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ సక్సెస్‌ కావడం కోసం ఆత్మీయ సమ్మేళనాల ఫార్ములాను ఎంచుకుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాష్ట్ర మంత్రి హరీష్‌ రావు ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించారు. దీంతో సభ సక్సెస్‌ కావడంతో పాటుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బీఆర్‌ఎస్‌ అసంతృప్త నేతలు ఏక తాటిపైకి వచ్చారని అధిష్టానం గుర్తించింది. దీంతో బిఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నేతలు వచ్చే ఎన్నికల్లో యాక్టివ్‌గా పని చేయాలంటే ఆత్మీయ సమ్మేళనాలను కొనసాగించాలని గులాబీ దళం డిసైడ్‌ అయింది. ఈ ఆత్మీయ సమ్మేళనాలతో నియోజకవర్గ స్థాయిలో గ్రూప్‌ రాజకీయాలకు చెక్‌ పెట్టవచ్చని అధిష్టానం ఆలోచనగా తెలుస్తోంది.
పార్టీ నేతల మధ్య బయటపడ్డ విబేధాలు : ఇప్పటికే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు పాదయాత్రలు, ఇతర కార్యక్రమాలతో ప్రజల్లో ఉండగా.. వారికి ధీటుగా ఆత్మీయ సమ్మేళనాలతో ప్రజల్లో ఉండే విధంగా బీఆర్‌ఎస్‌ పార్టీ నయా ఫార్ములను అమలు చేస్తోంది. ఆ నయా ఫార్ములాను ఇప్పటికే పలు జిల్లాల్లో నిర్వహించింది. అయితే హైదరాబాద్‌, కరీంనగర్‌లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాలలో పార్టీ నేతల మధ్య విబేధాలు బయట పడ్డాయి. ఉద్యమకారులకు అన్యాయం జరుగుతోందని పలువురు.. మంత్రుల ముందే నిరసన గళం విప్పారు. దాంతో కాసేపు గందరగోళం ఏర్పడిరది.
నేతలు, క్యాడర్‌ను ఏకతాటి మీదకు తెచ్చేందుకు ఏర్పాటు చేస్తున్న సమ్మేళనాలు నిరసనలకు వేదిక అవుతుండటం కారు పార్టీని కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో మరి బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనాల ఫార్ములా వచ్చే ఎన్నికల్లో ఏ మేరకు కలిసివస్తుందో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *