రెండేళ్లలో బందరు పోర్టు పూర్తి: సీఎం జగన్‌…

బందరు ఆటంకాలను అధిగమించి బందర్‌ పోర్టు పనులు ప్రారంభించుకోగలిగామన్నారు ఏపీ సీఎం జగన్‌. బందరు ప్రజల చిరకాల స్వప్నం నెరవేరబోతుందన్నారు. మరో రెండేళ్లలో ఇక్కడ పెద్ద ఓడలు కనిపిస్తాయన్నారు. వేల మందికి ఉపాధి లభించబోతుందన్నారు. బందరు పోర్టుతో కృష్ణా జిల్లా చరిత్ర మారిపోనుందన్నారు సీఎం జగన్‌. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ఇబ్బందులు అధిగమించి పోర్టు నిర్మాణ పనులు చేపడుతున్నట్టు తెలిపారు. ఏపీ సీఎం జగన్‌ ఈరోజు మచిలీపట్నంలో పర్యటిస్తున్నారు. ఏళ్ల నాటి కల ఎట్టకేలకు సాకారం అయింది. బందర్‌ పోర్టు నిర్మాణ పనులను ఏపీ సీఎం జగన్‌ ప్రారంభించారు. సోమవారం ఉదయమే తపసిపూడి తీరంలో బ్రేక్‌ వాటర్‌ పనులకు భూమి పూజ చేశారు. అనంతరం గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి పైలాన్‌ ఆవిష్కరించారు. బందరు పోర్టు శంకుస్థాపన సందర్భంగా మచిలీపట్నంలో కోలాహలం నెలకొంది. భారీగా వైసీపీ శ్రేణులు తరలి వచ్చారు. వాళ్లను చూసిన ముఖ్యమంత్రి అభివాదం చేశారు. అక్కడి నుంచి జిల్లా పరిషత్‌ సెంటర్‌ లోని భారత్‌ స్కాట్స్‌ అండ్‌ గైడ్స్‌ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ బందరు పోర్టు గురించి వివరించారు. అదే టైంలో ప్రతిపక్షాలపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. బందరుతో సముద్ర వర్తకానికి వందల ఏళ్ల చరిత్ర ఉందన్నారు సీఎం. ముంబై, చెన్నై మాదిరిగా బందరు మహానగరంగా ఎదిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఏళ్ల తరబడి నెరవేరని ఈ కల ఇప్పుడు నెరవేరుతోందని అన్నారు. ఆ పరిస్థితులన్నీ పూర్తిగా మారుస్తున్నామని భరోసా ఇచ్చారు. అన్ని కోర్టు కేసులను అధిగమించి, భూసేకరణ పూర్తిచేశామని చెప్పారు. అనుమతులన్నీ తీసుకొచ్చిన తర్వాత పనులు ప్రారంభించామని తెలియజేశారు. 5156 కోట్లతో నిర్మించి బందరు పోర్టులో నాలుగు బెర్తులు రాబోతున్నాయని వివరించారు సీఎం జగన్‌. 35 మిలియన్‌ టన్నుల కెపాసిటీతో స్టార్ట్‌ కాబోతోందన్నారు. ట్రాఫిక్‌ పెరిగే కొద్దీ 116 మిలియన్‌ టన్నుల కెపాసిటీ వరకూ విస్తరించుకునే అవకాశం కూడా ఉందని పేర్కొన్నారు. పోర్టుకు కనెక్టివిటీ ఇన్‌ఫ్రాను కూడా నిర్మిస్తున్నట్టు వివరించారు. 6.5 కిలోవిూటర్ల దూరంలోని జాతీయ రహదారిని నిర్మిస్తున్నామన్నారు. 7.5 కిలోవిూటర్ల గుడివాడ మచిలీపట్నం రైలు మార్గాన్ని కనెక్టివిటీ చేస్తున్నట్టు తెలిపారు. బందరు కాల్వనీటిని పైపులైను ద్వారా తీసుకు వచ్చి.. అనుసంధానం చేస్తున్నామన్నారు. అత్యంత మెరుగైన రవాణా వ్యవస్థకు పోర్టు మంచి ఆధారంగా ఉంటుందని తెలిపారు. కృష్ణా జిల్లా చరిత్రను బందరు పోర్టు మారుస్తుందని అన్నారు సీఎం జగన్‌. ఈ పోర్టు వల్ల మన రాష్ట్రం మాత్రమే బాగుపడ్డం కాకుండా వ్యాపారాలు బాగుపడతాయన్నారు. మచిలీపట్నం పోర్టు వల్ల ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకి కూడా ఉపయోగమన్నారు. పోర్టు ఆధారిత పరిశ్రమల వల్ల ఉద్యోగాలు, ఉపాధి లభిస్తాయని వివరించారు. డిగ్రీలు పూర్తి చేసుకున్న పిల్లలకు ఇక్కడే ఉద్యోగాలు లభిస్తాయన్నారు. పోర్టు నిర్మాణంలో గతంలో అనేక అడ్డంకులు వచ్చాయని వివరించారు. పోర్టు ఇక్కడ రాకూడదని చంద్రబాబు అనుకున్నారని ఆరోపించారు. 22 గ్రామాలు తీసుకోవాలని, 33వేల ఎకరాలు తీసుకోవాలని నోటిఫై చేసి రైతులు భూములను అమ్ముకునే స్వేచ్ఛలేకుండా చేశారన్నారు. దీనివల్ల పోర్టు అడగరని చంద్రబాబు ఇలా చేశారన్నారు. ఇక్కడ ప్రజలు బాగుపడకపోతే.. అందరూ అమరావతిలో తాను బినావిూగా పెట్టుకున్న భూములను విపరీతంగా అమ్ముకోవచ్చని ద్రోహం చేశారని విమర్శించారు. పోర్టుకు సంబంధించిన రోడ్డు, రైలు మార్గాలకు కేవలం 250 ఎకరాలు మాత్రమే తీసుకున్నామని తెలిపారు. ప్రతి రైతు ముఖంలో చిరునవ్వులు చూడాలంటూ నానికి చెప్పానన్నారు సీఎం. రైతులందరి సంతోషం మధ్య ఆ భూములు తీసుకుని మంచి పోర్టు నిర్మాణాన్ని ప్రారంభించామని సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూముల్లో 4వేల ఎకరాల్లో పోర్టు ఆధారిత పరిశ్రమలు వచ్చేట్టుగా కార్యాచరణ రూపొందిస్తున్నట్టు పేర్కొన్నారు. 24 నెలల్లోనే ఈ ప్రాంత రూపురేఖలు మారుతాయన్నారు. పెద్ద పెద్ద ఓడలు కనిపిస్తాయన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక మచిలీపట్నం రూపురేఖలు మారుతున్నాయన్నారు. గతంలో బందరు ముఖ్యపట్టణమైనా కలెక్టరుతోపాటు ఏ ఒక్క అధికారీ ఇక్కడ ఉండేవారు కాదని ఇప్పుడు ఏకంగా జిల్లా యంత్రాంగమే ఇక్కడ ఉంటోందన్నారు సీఎం జగన్‌. జిల్లాల విభజనతోనే ఇది సాధ్యమైందన్నారు. మరో మూడు నెలల్లో బందరు మెడికల్‌ కాలేజీలో అడ్మిషన్లు ప్రారంభం అవుతున్నాయని ప్రకటించారు. అవనిగడ్డ, పెడన, పామర్రు, కైకలూరు ప్రాంతాల ప్రజలకు మంచి వైద్య సేవలు అందుతాయని అభిప్రాయపడ్డారు. ఏ సమయంలోనైనా మత్స్యసంపదను ఒడ్డుకు తెచ్చుకునేందుకు ఇక్కడే మరో రూ.420 కోట్లతో ఫిషింగ్‌ హార్బర్‌ పనులు కూడా జరుగుతున్నాయని తెలిపారు జగన్‌. 60 శాతం పనులు ఇప్పటికే పూర్తయ్యాయని… 4 నెలల్లో ఇదికూడా అందుబాటులోకి వస్తోందన్నారు. ఇమిటేషన్‌ జ్యుయలరీ తయారీకి మద్దతుగా పాదయాత్రలో ఇచ్చిన హావిూకి తగ్గట్టుగా రూ.7.60 యూనిట్‌ ధరను రూ.3.75లకు తగ్గించామని తెలిపారు. దాదాపు 45వేల మందికి బతుకుతున్న ఈ పరిశ్రమకు మంచిచేశామన్నారు. ఈ జిల్లా ముఖ్యపట్టణంగా ఎదగడమే కాకుండా… భారీ స్థాయిలో వర్తకానికి, వాణిజ్యానికి పారిశ్రామిక అభివృద్ధికి మచిలీపట్నం కేరాఫ్‌ అడ్రస్‌గా మారబోతోందన్నారు. రాష్ట్రంలో పోర్టులకు సంబంధించి అనేక మార్పులు తీసుకొచ్చామన్నారు సీఎం జగన్‌. 320 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యాన్ని 2025`2026 నాటికి అదనంగామరో 110 మిలియన్‌ టన్నుల సామర్థ్యాన్ని జోడిస్తున్నామన్నారు. 75 సంవత్సరాలు స్వాతంత్య్రం వచ్చినప్పటికీ ఉన్న పోర్టులు నాలుగు పోర్టులు అయితే.. అక్షరాల రూ.16వేల కోట్లతో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేటలో జోరుగా అడుగులు పడుతున్నాయన్నారు. కాకినాడ గేట్‌వే ప్రాజెక్టుకు అడుగులు ముందుకు పడ్డాయని తెలిపారు. ఒక్కో పోర్టులో ప్రత్యక్షంగా, పరోక్షంగా 25వేల ఉద్యోగాలు వస్తాయని వివరించారు. పోర్టు ఆధారిత పరిశ్రమల కారణంగా లక్షల్లో ఉద్యోగాలు చదువుకున్న పిల్లలకు వస్తాయన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *