హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువులన్నింటినీ అన్ని రకాల అత్యాధునిక వసతులతో చెరువులను అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని చెరువులను అభివృద్ధి చేస్తున్నాం. కుటుంబ సమేతంగా సేద తీరడానికి అనువుగా చెరువులను అభివృద్ధి చేయాలని నిర్ణయించామని కేటీఆర్ తెలిపారు. సీఎస్ఆర్ ( కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ) నిధులతో జీహెచ్ఎంసీ పరిధిలోని 25, హెచ్ఎండీఏ పరిధిలోని 25 చెరువుల అభివృద్ధికి చేయూతనిచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న వివిధ నిర్మాణ రంగ సంస్థల ప్రతినిధులకు ఒప్పంద పత్రాలను కేటీఆర్ అందించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరానికి 440 పైచిలుకు సంవత్సరాల చరిత్ర ఉంది. హైదరాబాద్‌లో 1908లో మూసీ నదికి వరదలు వచ్చిప్పుడు.. నాటి నిజాం మోక్షగుండం విశ్వేశ్వరయ్యను పిలిచి మాట్లాడారు. ఈ నగరం బాగుండాలంటే.. భవిష్యత్‌లో వరదల ముప్పు రాకుండా సమన్వయం చేయాలని ఇంజినీరింగ్ ప్రణాళిక ఇవ్వాలని విశ్వేశ్వరయ్యను కోరారు. ఆ క్రమంలో వచ్చిందే హిమాయాత్ సాగర్, ఉస్మాన్ సాగర్. 1920లో గండీపేట్ పూర్తయింది. 94 శాతం నీళ్లు గ్రావిటీ ద్వారా మూసీలో కలుస్తున్నాయని తెలిపారు. జులై నాటికి హైదరాబాద్‌లో వంద శాతం మురుగు నీరు శుద్ధి చేస్తాం. దేశంలోనే వంద శాతం మురుగునీటి శుద్ధి చేసే నగరంగా హైదరాబాద్ నిలుస్తుంది అని కేటీఆర్ పేర్కొన్నారు.
దుర్గం చెరువుకు టూరిస్టుల తాకిడి.. హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయని కేటీఆర్ గుర్తు చేశారు. జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ పరిధిలో 155 చెరువులు ఉన్నాయి. దుర్గం చెరువు అభివృద్ధి చెందిన తర్వాత టూరిస్టులు అధికంగా వస్తున్నారు. సినిమా షూటింగ్‌లు కూడా చాలా అయ్యాయి. ఇటీవల హైదరాబాద్ సందర్శించిన ప్రముఖులు విదేశాల్లో ఉన్నామా అని ఆశ్చర్యపోతున్నారు. ఇది మన నగరం.. ఎంత గొప్పగా అభివృద్ధి చేసుకుంటే అంత బాగుంటుంది. మన పిల్లల భవిష్యత్ కోసం పెట్టుబడిగా భావించాలి. హైదరాబాద్‌లోని చాలా చెరువుల్లో ప్రైవేటు పట్టాలు ఉన్నాయి. చెరువుల్లో ఉన్న ప్రైవేటు భూముల యజమానులకు మరో చోట భూమి ఇస్తున్నాం. టీడీఆర్ కింద 200 శాతం విలువ కల్పిస్తున్నాం. 2000 సంవత్సరం నుంచి 5 దశల్లో చెరువుల శాటిలైట్ మ్యాప్స్ తీశాం. చెరువుల అభివృద్ధిలో రియల్టర్లను భాగస్వాములను చేస్తున్నాం. పక్కా ప్లాన్ రూపొందించి అమలు చేయాలని కేటీఆర్ సూచించారు.
ఆఫీస్ స్పేస్ ఆక్యుపేషన్‌లో హైదరాబాద్ నెంబర్ వన్..
ఆఫీస్ స్పేస్ ఆక్యుపేషన్‌లో దేశంలోనే హైదరాబాద్ నెంబర్ వన్‌గా నిలిచిందని కేటీఆర్ గుర్తు చేశారు. ఎంతో కృషి చేస్తే తప్ప ఇంత అభివృద్ధి జరగదు. ప్రపంచానికే వ్యాక్సిన్ క్యాపిటల్‌గా హైదరాబాద్ మారింది. ఫార్మా సిటీ ప్రారంభమైతే ప్రపంచ ఫార్మా నగరంగా మారుతుంది. శాంతిభద్రతలు, పరిపాలన బాగుండటం వల్లే భారీగా పెట్టుబడులు వచ్చాయి. 2030 కల్లా 250 బిలియన్ డాలర్ల స్థాయికి హైదరాబాద్ ఫార్మా ఇండస్ట్రీ. హైదరాబాద్‌లో వరల్డ్ క్లాస్ ఫిల్మ్ సిటీని రాచకొండలో నిర్మిస్తాం. ఒలింపిక్స్ స్థాయి స్పోర్ట్స్ సిటీ కూడా నిర్మిస్తాం. హైదరాబాద్‌లో మరిన్ని ఐకానిక్ భవనాలు రావాలన్నారు కేటీఆర్.
మూడేండ్లలో శంషాబాద్ మెట్రో లైన్ పూర్తి చేస్తాం.. : రెండు, మూడేండ్లలో శంషాబాద్ మెట్రో లైన్ పూర్తి చేస్తాం అని కేటీఆర్ ప్రకటించారు. లక్డీకాపూల్ – బీహెచ్ఈఎల్, నాగోల్ – ఎల్బీనగర్ రూట్లలో మెట్రోకు కేంద్రం సాయం కోరాం. ఆ రెండు రూట్లలో ఫీజబులిటీ లేదని కేంద్రం లేఖ రాయడం దుర్మార్గం. మనం కట్టే పన్నుల్లో కూడా మనకు కేంద్రం మొండి చేయి చూపిస్తోంది. యూపీ లాంటి రాష్ట్రాలకు మెట్రోలు ఇస్తున్నారు. ప్రజా రవాణాకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. హైదరాబాద్‌లో మెట్రో లైన్ 250 కిలోమీటర్లకు విస్తరిస్తాం. ఇప్పటి వరకు చూసిన అభివృద్ధి గోరంత.. చేయాల్సింది చాలా ఉంది అని కేటీఆర్ పేర్కొన్నారు.