కర్ణాటకకు ముఖ్యమంత్రి ఎవరనే సందిగ్ధతకు తెర… 20 మధ్యాహ్నం 12.30 గంటలకు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం… ఉప ముఖ్యమంత్రిగా కర్ణాటక కాంగ్రెస్‌ చీఫ్‌ డీకే శివకుమార్‌ బాధ్యతలు…

బెంగళూరు : కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో గత రెండుమూడు రోజులుగా నెలకొన్న సందిగ్ధతకు తెర పడిరది. డీకే శివకుమార్‌ సిద్ధరామయ్యతో పలుమార్లు సుదీర్ఘ చర్చల తర్వాత కాంగ్రెస్‌ అధిష్టానం సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా అధికారికంగా ప్రకటించింది. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా కర్ణాటక కాంగ్రెస్‌ చీఫ్‌ డీకే శివకుమార్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. మే 20, 2023న మధ్యాహ్నం 12.30 గంటలకు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియం ఈ వేడుకకు వేదిక కానుంది. కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య రెండోసారి ప్రమాణం చేయనుండటం గమనార్హం.
ఇదిలా ఉండగా.. గురువారం రాత్రి 7 గంటలకు కర్ణాటక సీఎల్పీ సమావేశం జరగనుంది. కర్ణాటక పీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్‌ను ఒప్పించడంలో కాంగ్రెస్‌ అధిష్టానం సక్సెస్‌ అయింది. సుదీర్ఘ చర్చల తర్వాత హైకమాండ్‌ హావిూలకు డీకే అంగీకారం తెలిపారు. డిప్యూటీ సీఎం పదవితో పాటు డీకే కోరిన శాఖలు ఇచ్చేందుకు హైకమాండ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇదిలా ఉండగా.. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య బాధ్యతలు స్వీకరించినా ఐదేళ్ల పాటు ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగే పరిస్థితి లేదు. పవర్‌ షేరింగ్‌ ఫార్ములాతో డీకేను కాంగ్రెస్‌ ఒప్పించింది. కర్ణాటక సీఎంగా మొదటి రెండేళ్లు సిద్ధరామయ్య, ఆ తర్వాత మూడేళ్లు సీఎంగా డీకే శివకుమార్‌ కొనసాగనున్నారు.కాంగ్రెస్‌ అధిష్టానం డీకేతో చేసిన బుజ్జగింపులు ఫలించడంతో కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే.. డీకే శివకుమార్‌తో, సిద్ధరామయ్యతో కలిసి చేయిచేయీ కలిపి ఫొటోలకు ఫోజులివ్వడం విశేషం. కర్ణాటక ప్రజల సంక్షేమం, అభివృద్ధికి కాంగ్రెస్‌ కట్టుబడి ఉందని, 6.5 కోట్ల కన్నడిగులకు ఇచ్చిన 5 గ్యారెంటీలను నెరవేరుస్తామని మల్లికార్జున ఖర్గే ట్వీట్‌ చేశారు. కర్ణాటక కాంగ్రెస్‌ నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌, కర్ణాటక కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ రణ్‌దీప్‌ సూర్జేవాలా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ కలిసి బ్రేక్‌ఫాస్ట్‌ చేశారు. ఇక.. బెంగళూరులోని సిద్ధరామయ్య ఇంటి దగ్గర భద్రత పెంచారు. కంఠీరవ స్టేడియంలో జరగనున్న సిద్ధరామయ్య ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విపక్ష నేతలను కాంగ్రెస్‌ ఆహ్వానించింది.కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ తనను సీఎం చేస్తే సిద్దరామయ్య విసిరే అన్ని సవాళ్లను ధీరోచితంగా ఎదుర్కొంటానని భరోసా ఇచ్చినప్పటికీ కాంగ్రెస్‌ అధిష్టానం పవర్‌ షేరింగ్‌ ఫార్ములాకే మొగ్గు చూపడం గమనార్హం. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 20 స్థానాల్లో ఘన విజయాన్ని అందిస్తానని, కావాలంటే రాతపూర్వకంగా రాసిస్తానని కూడా డీకే హావిూ ఇచ్చినట్టు తెలుస్తోంది. 2018 శాసనసభ ఎన్నికల్లో సిద్దూ నాయకత్వంలోనే వెళ్లి పరాజయాలను మూటగట్టుకున్నామని, తాను కేపీసీసీ అధ్యక్షుడు అయ్యాక పార్టీని గాడిన పడేసి జవసత్వాలు నింపి పూర్తి స్థాయి మెజారిటీ సాధించానని కుండబద్ధలు కొట్టినట్టుగా ఆయన ప్రస్తావించినట్టు సమాచారం. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు 141 స్థానాలు లభిస్తాయని, కావాలంటే రక్తాక్షరాలతో రాసిస్తానని డీకే శివకుమార్‌ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *