పరీక్షల్లో తప్పడంతో ఆత్మహత్యకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తున్న విషయం.. ఇంటర్‌లో చెల్లి పాసై తాను ఫెయిలై అయ్యానని… అక్క ఆత్మ హత్య

హైదరాబాద్‌ : తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు మంగళవారం నాడు విడుదలైన విషయం తెలిసిందే. ఫలితాలు వచ్చినపట్నుంచీ ఇప్పటి వరకూ పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. బిడ్డలే తమ భవిష్యత్తని ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నారు. ఇంటర్‌ ఫలితాలు ఎలా వచ్చినా విద్యార్థులు ధైర్యంగా ఉండాలని అధికారులు, మంత్రులు, నిపుణులు చెప్పిన మాటలు మాటలుగానే మిగిలిపోతున్నాయి. ఇప్పుడు ఫెయిల్‌ అయినా సప్లిమెంట్‌ రాసుకోవచ్చన్న ఆలోచన లేకుండా ఫెయిల్‌ అనే ఒక్కమాటతో జీవితాన్నే వదిలేస్తున్నారు. తల్లిదండ్రులు ధైర్యం చెబుతున్నప్పటికీ ఫెయిల్‌ అయ్యామనే కారణాలతో విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకూ 9 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోగా.. తాజాగా హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఇంటర్‌ విద్యార్థిని గాయత్రి ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిరది. తన చెల్లి ఇంటర్‌లో పాసై తాను ఫెయిలై అయ్యానని తీవ్ర మనస్థాపానికి గురైన గాయత్రి బుధవారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. చెల్లి, అక్క ఇద్దరూ హస్తినపురంలోని నవీనా కాలేజీలో ఇంటర్‌ చదివారు.
క్షణికావేశంలో ఇలా..
జగిత్యాల జిల్లా మేడిపల్లిలో ఒకరు, పటాన్‌చెరులో ఇంకొకరు, హైదరాబాద్‌లో చదువుతున్న గద్వాల్‌ చెందిన మరో స్టూడెంట్‌ సూసైడ్‌ చేసుకున్నారు. సికింద్రాబాద్‌ నేర్‌డ్‌మెడ్‌లో ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ స్టూడెంట్‌ రేవంత్‌ కుమార్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే హైదరాబాద్‌లో చదువుతున్న ప్రకాశంకు చెందిన మరో విద్యార్థిని, ఖైరతాబాద్‌లో గౌతమ్‌ కుమార్‌ సూసైడ్‌ చేసుకున్నాడు. కొత్తకోటకు చెందిన మరో విద్యార్థిని మార్కులు తక్కువ వచ్చాయని ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. రంగారెడ్డి జిల్లా మణికొండలో విషాదం చోటు చేసుకుంది. ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థి శాంతకుమారి ఆత్మహత్య చేసుకుంది. పరీక్షలో ఫెయిల్‌ అయిందని తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థి ఐదో అంతస్తు నుండి కిందకి దూకి ఆత్మహత్యకు పాల్పడిరది. వెంటనే కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శాంతకుమారి మృతిచెందింది. రాయదుర్గం ప్రభుత్వ కళాశాలలో శాంతకుమారి మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.హైదరాబాద్‌లోని సంతోష్‌ నగర్‌లో మరో ఇంటర్‌ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. సంగెం లక్ష్మీబాయి జూనియర్‌ కళాశాలలో ఎంపీసీ పూర్తిచేసిన జాహ్నవి... ఇంటర్‌ ఫలితాల్లో ఫెయిల్‌ అయ్యింది. దీంతో మనస్థాపంతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు విద్యార్థిని తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. నగరంలోని ఖైరతాబాద్‌లోని తుమ్మల బస్తీలో ఓ ఇంటర్‌ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డారు. నిన్న వెలువడిన ఇంటర్‌ రెండవ సంవత్సర ఫలితాలలో ఫెయిల్‌ కావడంతో గౌతమ్‌ కుమార్‌ అనే విద్యార్థి ఇంట్లో ఫ్యాన్‌కు ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్‌ రెండోవ సంవత్సరం ఒక సబ్జెక్ట్‌ ఫెయిల్‌ కావడంతో మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న సైఫాబాద్‌ పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌ మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *