సినిమా ను ఆపగలరేమో గాని సత్యాన్ని ఆపలేరు‘ది కేరళ స్టోరీ’ బ్యాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన… రాములమ్మ


హైదరాబాద్‌ : ప్రభుత్వాలనే ఎన్నకునే ప్రజలకి.. ఏ సినిమా చూడాలో.. ఏ సినిమా చూడకూడదో.. అనే విజ్ఞత లేదని అనుకుంటున్నారా? అని ప్రశ్నిస్తూ.. సోషల్‌ విూడియాలో రాములమ్మ ఓ పోస్ట్‌ చేశారు. అందులో..సెన్సార్‌షిప్‌ పూర్తి చేసుకున్న ‘ది కేరళ స్టోరీ’ సినిమాకు వ్యతిరేకంగా వచ్చిన పిటిషన్లని కోర్టులు సైతం పక్కన పెట్టినప్పుడు.. ఆ సినిమాని ప్రజలకి దూరం చేసే హక్కు ఎవరికుంది? అని ప్రశ్నించారు నటి, బీజేపీ నేత విజయశాంతి శాంతి భద్రతల పేరు చెప్పి.. ‘ది కేరళ స్టోరీ’ చిత్ర ప్రదర్శనని అడ్డుకుంటున్న ప్రభుత్వాలపై ఆమె సోషల్‌ విూడియా వేదికగా మండిపడ్డారు. ప్రభుత్వాలనే ఎన్నకునే ప్రజలకి.. ఏ సినిమా చూడాలో.. ఏ సినిమా చూడకూడదో.. అనే విజ్ఞత లేదని అనుకుంటున్నారా? అని ప్రశ్నిస్తూ.. సోషల్‌ విూడియాలో ఆమె ఓ సుధీర్ఘ పోస్ట్‌ చేశారు. విజయశాంతి తన పోస్ట్‌లో ఏం రాసుకొచ్చారంటే.. ‘‘ది కేరళ స్టోరీ సినిమాపై కొనసాగుతున్న చర్చలు, వాదవివాదాలు, నిరసనలను గమనిస్తుంటే ఒక విషయం బాగా అర్థమవుతోంది. ఏ సినిమా అయినప్పటికీ, దానిని చూడాలా వద్దా?… అందులోని అంశాలు నిజమా, కాదా? అనేది ప్రజలు తమ విజ్ఞతతో తెలుసుకోవాల్సిన విషయం కాగా…. ప్రజలకు ఉన్న ఆ విజ్ఞతని కొన్ని వర్గాలు, చివరికి రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తమ చేతుల్లోకి లాక్కోవడం దురదృష్టకరం. సెన్సార్‌షిప్‌ పూర్తి చేసుకున్న ‘ది కేరళ స్టోరీ’ సినిమాకు వ్యతిరేకంగా వచ్చిన పిటిషన్లని కోర్టులు సైతం పక్కన పెట్టినప్పుడు ఆ సినిమాని ప్రజలకి దూరం చేసే హక్కు ఎవరికుంది? మనది ప్రజాస్వామిక దేశం… జనం తమ విజ్ఞతతో ప్రభుత్వాలనే ఎన్నుకుంటున్న రోజుల్లో ఒక సినిమాని చూసి, అందులో ఏ అంశాల్ని స్వీకరించాలో… వేటిని తిరస్కరించాలో ప్రజలకి తెలియదని అనుకుంటున్నారా? చివరికి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఆ వర్గాలకి భయపడి సినిమా ప్రదర్శనకు ఆటంకాలు సృష్టించడం దారుణ మన్నారు.గతంలో ది కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమా విషయంలోనూ ఇలాగే కొన్ని వర్గాలు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేసినప్పుడు ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోండి. సినిమా ప్రదర్శనని ఆపగలరేమో… కానీ అందులోని సత్యం మాత్రం గుండెల్ని చీల్చుకుని మనసుల్లో నాటుకోవడం ఖాయమని గుర్తించండి. ఒక సినిమా చూస్తేనే శాంతిభద్రతలు చెయ్యి దాటిపోయే సమస్య ఆ నిషేధించిన 3 రాష్ట్రాలలో ఉండి… మిగతా దేశంలోని 27 రాష్ట్రాలకు ఆ పరిస్థితి లేదంటే అది ఆ నిషేధించిన రాష్ట్రాల పాలనా వైఫల్యం అయితదా?… లేక మెజారిటీ ప్రజల మనోభావాలను గుర్తించని మరో విధానం అయితదా?… వారికే తెలియాలి..’’ అని రాములమ్మ ప్రశ్నాస్త్రాలు సంధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *