మహిళ స్వయం సహాయక సంఘాల సభ్యుల నాలుగేళ్ల నిరీక్షణ ఫలించింది. స్వయం సహాయక సంఘాల్లోని మహిళా సభ్యులకు వడ్డీలేని రుణాలు (వీఎల్ఆర్) అందిస్తామన్న ప్రభుత్వం హామీ నెరవేర్చింది. పురపాలక సంఘాల్లో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణ ప్రాంతాల్లో సెర్ప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళా సంఘాల సభ్యులు బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలను క్రమం తప్పకుండా చెల్లించిన వారికి ప్రభుత్వం వడ్డీ రాయితీ ప్రకటించింది. ఆయా సంఘాలకు తామే వడ్డీని చెల్లిస్తామన్న ప్రభుత్వం నాలుగేళ్ల నుంచి వడ్డీని చెల్లించకపోవడంతో సభ్యులు వారు తీసుకున్న రుణాల కిస్తీలతో పాటు వడ్డీని చెల్లిస్తూ వచ్చారు. 2018-19 ఆర్థిక సంవత్సరం వరకు కొన్ని సంఘాలకు గతంలో ప్రభుత్వం చెల్లించింది. మిగిలిన వారికి కూడా వడ్డీ రాయితీని ఇవ్వాలంటూ వచ్చిన ప్రతిపాదనలతో ప్రభుత్వం ఇటీవల జిల్లాలోని 25,733 సంఘాలకు 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 19.92 కోట్లు వడ్డీ రాయితీని విడుదల చేసింది. దీంతో మహిళా సభ్యుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు 90 శాతం మహిళా సంఘాల ఖాతాల్లో వడ్డీ రాయితీ జమ కావడంతో నేటి వరకు వారు బ్యాంకులకు చెల్లించిన వడ్డీ తిరిగి లభించడం మహిళలకు ఊరటనిస్తోంది.