పురపాలక శాఖపైన నేడు మంత్రి కేటీఆర్ విస్తృత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. హైదరాబాద్ నగరంలో వార్డు పాలన వ్యవస్థను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రణాళికలపైన పురపాలక శాఖ ఉన్నతాధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులకు వార్డు పాలన వ్యవస్థకు సంబంధించి ప్రభుత్వ ఆలోచన విధానాన్ని, లక్ష్యాలను వివరించారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో పరిపాలనను వికేంద్రీకరించి నూతనంగా జిల్లాలను, రెవెన్యూ డివిజన్లను, మండలాలను, ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీంతోపాటు నూతన పురపాలికలను, గ్రామ పంచాయతీలను కూడా ఏర్పాటుచేసి ప్రజల ఇంటి ముందుకే పరిపాలన ఫలాలను తీసుకువెళ్లే ప్రయత్నంలో ప్రభుత్వం విజయం సాధించిందన్నారు. ఈ దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకువెళ్లే ఉద్దేశంతో హైదరాబాద్ నగరంలోనూ పరిపాలనను మరింతగా పౌరులకు చేరువ చేయాలన్న ఉద్దేశంతో వార్డు పాలన వ్యవస్థకు శ్రీకారం చుట్టబోతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే వార్డు పాలన వ్యవస్థ ద్వారా ప్రజలు తమ పనుల కోసం ప్రస్తుతం సర్కిల్ కార్యాలయాలకు లేదా జోనల్ ఆఫీసులకు వెళ్లకుండా తమకు అత్యంత చేరువగా ఉండే వార్డు పరిధిలోనే తమ పనులను చక్కబెట్టుకోడానికి, తమ ఫిర్యాదులను, ప్రభుత్వానికి అవసరమైన సలహాలు సూచనలు అందించేందుకు వీలు కలుగుతుంది అని తెలిపారు. దీంతో వేగంగా ప్రభుత్వానికి ప్రజల సమస్యలను తెలుసుకునే అవకాశం రావడంతో పాటు వాటిని పరిష్కరించేందుకు వీలు కలుగుతుందన్నారు. ప్రభుత్వ పాలనలో పౌరుల భాగస్వామ్యం పెంచడమే ఈ నూతన విధాన లక్ష్యం అన్నారు.