హైదరాబాద్: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం మూడో రోజు విచారణ కొనసాగుతోంది. కస్టడీలో ఉన్న నలుగురు నిందితులు ప్రవీణ్, రాజశేఖర్, డాక్యానాయక్, రాజేశ్వర్‌ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఈరోజుతో కోర్టు ఇచ్చిన కస్టడీ గడువు ముగియనున్న నేపథ్యంలో సిట్ అధికారులు వీలైనంత కీలక వివరాలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. టీఎస్పీఎస్సీలో ఏఎస్‌వోగా పనిచేసిన ప్రవీణ్ నుంచి రేణుక ఏఈ ప్రశ్నపత్రం కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఈ మేరకు ప్రవీణ్‌కు రూ.10లక్షలకు పైగా చెల్లించినట్లు, ఇద్దరికి మాత్రమే పేపర్ విక్రయిస్తానని ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఆ తర్వాత రేణుక నుంచి ఆమె భర్త డాక్యానాయక్ చాలా మందికి ప్రశ్నపత్రం విక్రయించినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. అయితే, రేణుకకు తెలియకుండానే పేపర్ విక్రయాలు జరిగినట్లు సిట్ అధికారులు గుర్తించారు. మధ్యవర్తుల ద్వారా టీఎస్పీఎస్సీలో పనిచేసే మరికొంత మంది సిబ్బందికి కూడా పేపర్ విక్రయించినట్లు తేలింది. డాక్యానాయక్ ఇచ్చిన సమాచారం మేరకు ఇప్పటికే ఈ కేసులో ప్రశాంత్, రాజేందర్, తిరుపతిని సిట్ అధికారులు అరెస్టు చేశారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వారే లక్ష్యంగా.. డాక్యానాయక్ చాలా మందితో ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో అసలు ఏఈ ప్రశ్నపత్రం ఎంతమందికి విక్రయించారనే దానిపై సిట్ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పలువురికి విక్రయించినట్లు సమాచారం. మరోవైపు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీపైనా సిట్ అధికారులు దృష్టి సారించారు. ఈమేరకు ప్రవీణ్, రాజశేఖర్‌ను ప్రశ్నిస్తున్నారు. టీఎస్పీఎస్సీలో పనిచేసే సురేశ్, రమేశ్, షమీమ్‌కు వీరిద్దరూ ప్రశ్నపత్రం విక్రయించినట్లు గుర్తించారు. షమీమ్ మాత్రం గ్రూప్-1 ప్రిలిమ్స్, ఏఈ ప్రశ్నపత్రానికి ఎలాంటి డబ్బులు తీసుకోలేదని తెలిపారు. రమేశ్, సురేశ్‌కు స్నేహం ఉన్న కారణంగా ఉచితంగానే ఇచ్చినట్లు భావిస్తున్నారు. ఇప్పటివరకు నగదు లావాదేవీలు సంబంధించి ఎటువంటి సమాచారం బయటపడలేదు.