రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు… గ్రామాల్లో రోడ్డు భద్రతా కమిటీల ఏర్పాటు… డీజీపీ అంజనీ కుమార్.

రాష్ట్రంలో రోడ్డు ప్రమాద నివారణ చర్యల్లో భాగంగా అన్ని గ్రామాల్లో రోడ్డు భద్రతా కమిటీలను ఏర్పాటు చేయనున్నట్టు డీజీపీ అంజనీ కుమార్ వెల్లడించారు. రాష్ట్రంలో రహదారుల భద్రతా చర్యలపై పోలీస్ కమీషనర్లు, ఎస్.సి. లతో వీడియో కాన్ఫరెన్స్ నేడు నిర్వహించారు. అడిషనల్ డీజీ లు శివధర్ రెడ్డి, సంజయ్కుమార్ జైన్, ఐజి లు చంద్ర శేఖర్ రెడ్డి, షా నవాజ్ కాసీం, రోడ్ సెఫీటి విభాగం ఎస్.పి రాఘవేందర్ రెడ్డి లు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు. ఈ సందర్బంగా డీజీపీ మాట్లాడుతూ, ఏ ఇతర నేరాలతో పోల్చినా రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్య అధికంగా ఉందని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డు భద్రతా నియమ, నిబంధనలను పాటించడమే మార్గమని, వీటి గురించి పెద్ద ఎత్తున ప్రజల్లో చైతన్యం, అవగాహన కల్పించేందుకై గ్రామ స్థాయిలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఈ కమిటీలో రిటైర్డ్ ఉపాధ్యాయులు, మహిళలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను సభ్యులుగా నియమించనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో రహదారుల నిర్మాణం గణనీయంగా పెరిగిందని, ఇదే సమయంలో రోడ్డు ప్రమాదాలు, మరణాల సంఖ్య కూడా పెరిగాయని అన్నారు. తరచుగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాల హాట్ స్పాట్ లను ఇప్పటికే గుర్తించడం జరిగిందని, సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో ఆ ప్రమాద ప్రాంతాలలో తగు నివారణా చర్యలు చేపట్టాలని సూచించారు. తమ పరిదిలో నిరంతరం రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలపై ఎప్పటికప్పుడు సమీక్ష చేయడంతో పాటు, 108 వాహన పనితీరుపై కూడా సమీక్షించాలని డీజీపీ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్లు, రోడ్లు భవనాలతో సహా సంబంధిత శాఖల అధికారులు, స్వచ్చంద సంస్థల సమన్వయంతో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్రంలో 4983 కిలోమీటర్ల జాతీయ రహదారులు, 1687 కి.మీ ల స్టేట్ హై- వే లు, 32 ,913 కి.మీ.ల జిల్లా, గ్రామీణ రహదారులు మొత్తం 29 ,583 కిలోమీటర్ల విస్తీర్ణంలో రహదారులున్నాయని పేర్కొన్నారు. వీటిలో 2020 సంవత్సరంలో 19 ,172 రోడ్డు ప్రమాదాలు జరగగా 2882 మంది మరణించారని తెలిపారు అదేవిధంగా, 2021 లో 21,315 ప్రమాదాలలో 7557 మంది మరణించారని, 2022 లో 21 ,619 ప్రమాదాలలో 7559 మంది మరణించారని వివరించారు. వీటిలో కేవలం ద్విచక్ర వాహనాల ప్రమాదాలలోనే ఎక్కువగా మరణాలు జరుగుతున్నాయని అన్నారు. 2020 లో 9097 రోడ్డు ప్రమాదాల్లో 3469 మంది మరణించగా, 2021 లో 10598 ప్రమాదాలలో 4082 మరణాలు, 2022 లో 10653 ప్రమాదాలలో 3977 మంది మరణించారని అన్నారు. మొత్తం ప్రమాదాలలో ద్విచక్ర వాహనాల వల్లే 53 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో జరిగే మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 16 శాతం సైబరాబాద్ లో, 16 శాతం రాచకొండ కమిషనరేట్ పరిధిలో, 12 శాతం ప్రమాదాలు హైదరాబాద్ కమీషనరేట్ పరిధిలో జరుగుతున్నాయని తెలిపారు. కొమరం భీమ్ అసిఫాబాద్, నారాయణ్ పెట్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తక్కువగా రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయని తెలిపారు. రోడ్డు ప్రమాదాలను 47 శాతం తగ్గించడంతో పాటు, 63 శాతం మరణాలను తగ్గించడంలో ములుగు జిల్లా మంచి ఫలితాలు సాధించిందని అభినందించారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించడంలో చర్యలు చేపట్టిన జిల్లాల ఎస్.పి లను డీజీపీ అభినందించారు. రోడ్డు భద్రతా విభాగం అడిషనల్ డీజీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ, 2021 & 2022 సంవత్సరాలలో పోల్చితే 2023 మొదటి మూడు నెలల కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య, మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిందని వెల్లడించారు. రాష్ట్రంలో 29 ,583 కిలోమీటర్ల రోడ్డు విస్టీర్ణంలో 1602 ప్రమాదం జరిగేందుకు అవకాశమున్న హాట్ స్పాట్ లను గుర్తించడం జరిగిందని వెల్లడించారు. ఈ హాట్ స్పాట్ ల ప్రాంతాల్లో సంబంధిత శాఖల సహాయంతో నివారణా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న కంటి వెలుగు కార్యక్రమంలో 45 సంవత్సరాలు దాటిన డ్రైవర్లందరికీ కంటి పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు. తరచుగా రోడ్డు ప్రమాదాలు జరిగేందుకు కారణమయ్యే అంశాలపై కళాజాత లతో చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా సాయంత్రం 6 గంటలనుండి రాత్రి 9 గంటల ప్రాంతంలో, మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అధికంగా జరుగుతున్నాయని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *