మానవ తప్పిదాల కారణంగా కాలుష్యం పెరిగి భూమికి పెను ప్రమాదం జరిగే అవకాశం పొంచి ఉందని, పర్యావరణ పరిరక్షణ భాద్యత మన అందరి పై ఉందని , కాబట్టి పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించి మన ధరిత్రిని భవిష్యత్తు తరాల కోసం పరిరక్షించి అందివ్వాలని జిల్లా కలెక్టర్ కె వెంకట రమణ రెడ్డి అన్నారు. శనివారం ఉదయం ప్రపంచ ధరిత్రి దినోత్సవo సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, తిరుపతి వారి ఆధ్వర్యంలో స్థానిక ఎస్.వి.ఆర్ట్స్ కాళాశాల నుండి బాలాజీ కాలనీ మీదుగా రామచంద్ర పుష్కరిణి వరకు ఏర్పాటు చేసిన పర్యావరణ ర్యాలీని జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ గురించి ప్రజల్లో అవగాహన కలిగించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యమని, పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు మానవాళి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆధునిక కాలంలో మారుతున్న వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న జనాభా , ఏర్పడుతున్న నీరు, వాయు కాలుష్యం, అటవీ నిర్మూలన మరియు ఇతర ప్రధాన పర్యావరణ సమస్యల గురించి ప్రజలలో అవగాహన కల్పించి వాటిని రక్షించే మార్గాలపై ప్రజలలో అవగాహన పెంచడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందనీ అభిప్రాయ పడ్డారు. ఓజోన్ పొర ప్రమాదకర స్థితిలో ఉందని, అందువల్ల ఆల్ట్రా వయొలెట్ కిరణాలు భూమిపైన పడి విపత్తులు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఇలాగే కొనసాగితే మానవాళికి, జంతు జాలానికి ప్రమాదం జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి ఒకటే మార్గం కాదని అది పర్యావరణ హితంగా ఉండాలని, పర్యావరణాన్ని సుస్థిరంగా కాపాడుకోవడం కూడా మనందరి బాధ్యత అనీ పిలుపునిచ్చారు. మన రాష్ట్ర ప్రభుత్వం సుస్థిర అభివృద్ధి లక్ష్యాల అమలుకు ఎంతగానో ప్రాధాన్యత ఇస్తోందని, మానవాళి మనుగడ విశ్వంలోని పాలపుంతలో గల భూమిపై మాత్రమే ఉన్నదని, అందుకే మనం కలిసికట్టుగా ఈ ధరిత్రిని కాపాడుకుంటూ భవిష్యత్తు తరాలకు అందివ్వాలని కోరారు. రామచంద్ర పుష్కరిణీ వద్ద ర్యాలీ ముగిసిన తర్వాత ర్యాలీలో పాల్గొన్న వారు, ప్రజలు పర్యావరణ ప్రతిజ్ఞ చేసారు.