అనంతపురం నగరంలోని 5వ రోడ్డులో మారెక్క అనే ఓ మహిళ గురువారం ఉదయం ఇంటి ముందు చీపురుతో వాకిలి ఊడుస్తోంది. ఇదే సమయంలో పల్సర్ బైక్పై ఇద్దరు వ్యక్తులు వచ్చి మారెక్క ఇంటి ముందు ఆగారు. అనంతరం వారిద్దిరీలో ఒక వ్యక్తి మారెక్క దగ్గరికీ వచ్చి ఏదో అడ్రస్ అడుగుతున్నట్లు నటించాడు. దీంతో నిజంగానే కావొచ్చన్నట్లు సదరు మహిళ అతడికి సమాధానం చెబుతోంది. రోడ్డుపై జనాలు ఎవరూ సంచరించడం లేదని కాన్ఫామ్ చేసుకున్న అతను ఒక్కసారిగా మారెక్క మెడలోని గొలుసును లాగేశాడు.
అప్పటికే పారిపోవడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి బైక్ ఎక్కి ఇద్దరూ అక్కడి నుంచి పారిపోయారు. ఇదంతా కేవలం క్షణాల్లోనే జరిగిపోయింది. దీంతో అసలేం జరిగిందో కూడా ఊహకందని మారెక్క దిగ్భ్రాంతికి గురైంది. మారెక్క మెడలోని గొలుసు రెండు తులలు ఉంటుందని వాపోయింది. ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా విచారణ చేస్తున్నారు.