ముంబై : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ లో అజిత్ పవార్ సృష్టిస్తున్న ప్రకంపనల ప్రభావం బీజేపీశివసేన కూటమిని తాకుతోంది. అజిత్ పవార్ వర్గం బీజేపీతో చేతులు కలిపితే, తాము కూటమి నుంచి వైదొలగుతామని శివసేన హెచ్చరించింది. ఎన్‌సీపీ నమ్మకద్రోహానికి పెట్టింది పేరు అని దుయ్యబట్టింది. అజిత్ పవార్ వర్గం నేరుగా బీజేపీ తో జట్టు కట్టకపోవచ్చునని భావిస్తున్నట్లు తెలిపింది.ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన అధికార ప్రతినిధి సంజయ్ సిర్సత్ ముంబైలో విూడియాతో మాట్లాడుతూ, నమ్మక ద్రోహం చేసే పార్టీ ఎన్‌సీపీ అని చెప్పారు. అధికారంలో ఎన్‌సీపీతో కలిసి ఉండేది లేదన్నారు. ఎన్‌సీపీతో బీజేపీ జట్టుకడితే, మహారాష్ట్ర ప్రజలు ఇష్టపడరని తెలిపారు. కాంగ్రెస్, ఎన్‌సీపీలతో తాము కలిసి ఉండటాన్ని ప్రజలు ఇష్టపడకపోవడం వల్లే తాము ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన నుంచి బయటకు వచ్చామని గుర్తు చేశారు. ఎన్‌సీపీలో తాను ఉండబోనని అజిత్ పవార్ చెప్పలేదని గుర్తు చేశారు.ఇదిలావుండగా, అజిత్ పవార్ వర్గం 2019 నవంబరులో బీజేపీతో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా అప్పట్లో ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆ ప్రభుత్వం కొద్ది గంటలు మాత్రమే నిలిచింది. ఆ తర్వాత కాంగ్రెస్
శివసేన`ఎన్‌సీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ కూటమిలోని శివసేన నుంచి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో కొందరు ఎమ్మెల్యేలు వేరుపడి, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. శివసేన నేత ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రిగా, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ప్రస్తుత ప్రభుత్వం నడుస్తోంది.ఎన్‌సీపీకి మహారాష్ట్రలో 53 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో మూడిరట రెండొంతుల మంది అజిత్ పవార్ వెంట ఉన్నారనే వార్తలు కొద్ది రోజుల క్రితం హల్‌చల్ చేశాయి. ఈ వార్తలను ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ కొట్టిపారేశారు.