శ్రీకాకుళం జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. పలాస
కాశీబుగ్గలో భగవతి థియేటర్ రోడ్డులోని బైక్ షోరూమ్, హార్డ్‌వేర్ షాపులో మంటలు చెలరేగాయి. బుధవారం తెల్లవారుజామున పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు షాపు యజమానులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు అగ్నిమాపక సిబ్బంది స్థానికులతో కలిసి మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్య్కూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. అయితే బైక్ షోరూమ్ బ్యాటరీ పేలడంతో ఘటన జరిగినట్లు చెబుతున్నారు.
ఈ ఘటనలో మొత్తం 70కి పైగా ద్విచక్ర వాహనాలు పూర్తి దగ్ధమైనట్లు యజమానులు చెబుతున్నారు. ముందు బైక్ షోరూమ్‌లో మంటలు చెలరేగగా.. ఆ తర్వాత పక్కనే ఉన్న హార్డ్ వేర్ షాపులోకి కూడా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో మూడు షాపులు దగ్ధమయ్యాయి. బైక్ షోరూమ్‌తో పాటుగా బ్యాటరీ షాపు, హార్డ్‌వేర్ షాపు కూడా దగ్ధమైంది. భారీగా ఆస్తి నష్టం సంబంధించిందని యజమానులు చెబుతున్నారు.