సూర్యాపేట బంగారం దొంగతనంలో కీలక మలుపు – 8.5 కిలోల బంగారం, యూపీ వాసులపై అనుమానం

Image: Screenshot from ‘ https://www.siasat.com ” (used under fair use for reporting)
సూర్యాపేటలో జరిగిన భారీ బంగారం దొంగతనానికి సంబంధించి తాజా దర్యాప్తులో కీలక పరిణామాలు వెలుగు చూస్తున్నాయి. తొలుత 18 కిలోల బంగారం మాయమైందని అనుకున్నారు కానీ చివరికి 8.5 కిలోల బంగారం, నాలుగు బంగారు బిస్కెట్లు, 17 లక్షల నగదు తప్పిపోయినట్లు నిర్ధారణ అయ్యింది.
సూర్యపేట పట్టణంలోని బంగారం దుకాణంలో జరిగిన భారీ చోరీ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ముఠా దొంగలు పూర్తిగా ప్రణాళికాబద్ధంగా చోరీకి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. మొదట 18 కిలోల బంగారం దొంగిలించారని భావించినా, సాంకేతిక సాక్ష్యాల పరిశీలనతో అసలు వివరాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం 8.5 కిలోల బంగారం, నాలుగు బంగారు బిస్కెట్లు, 17 లక్షల నగదు అపహరణకు గురైంది. అదనంగా, దొంగలు లాకర్ గదిలో ఉన్న అరున్నర కిలోల బంగారాన్ని అచ్చం అలాగే వదిలి వెళ్లడం గమనార్హం.
ఈ ఘటనపై పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. దుకాణం వెనుక భాగంలో ఉన్న రెండు బాత్‌రూం మధ్య ఉన్న నాలుగు ఇంచుల గోడను గోడల్ని చీల్చి చోరీకి పాల్పడ్డారు. చుట్టుపక్కల నివాసాలు లేకపోవటంతో ఎవరికీ అనుమానం రాలేదు. ఇదే ప్రాంతంలోని మిగిలిన దుకాణాలకు కూడా వెనుక నుంచి ప్రవేశించడానికి వీలు ఉండటంతో చోరీ సులభమైంది.
దర్యాప్తులో భాగంగా పోలీసులు ఒక కీలక సమాచారం గుర్తించారు. దుకాణానికి కేవలం 100 మీటర్ల దూరంలో ఉన్న ఓ పాత ఇంట్లో ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఐదుగురు వ్యక్తులు గత రెండు నెలలుగా నివసించినట్లు గుర్తించారు. వారి ఇంటిని తనిఖీ చేసిన పోలీసులు, లోపల చిన్న చిన్న బంగారం పూసలు లభించినట్లు సమాచారం. అంతేకాక, ఆ ఇంటిలో కేవలం ఒక చాప మాత్రమే ఉండటం, ఇతర సామగ్రి లేకపోవటం దర్యాప్తులో కీలకంగా మారింది. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ విభాగాలు ఆ ఇంటిపై పూర్తి పరిశీలన చేపట్టి ఆధారాలు సేకరిస్తున్నాయి.
ఈ ముఠా దొంగలు స్థానికంగా ఉంటూ చోరీకి ముందు పెద్ద ఎత్తున రేక్కీ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసును మరింత వేగంగా విచారించి నిందితులను పట్టుకునేందుకు అధికారులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.