డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయంలోని వ్యవసాయ శాఖ మంత్రిత్వ కార్యాలయం సమావేశ మందిరంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తొలి సమీక్ష నిర్వహించారు. వానాకాలంలో కోటి 40 లక్షల ఎకరాలలో సాగయ్యే అవకాశం ఉండటంతో, మరో 14 లక్షల ఎకరాలలో ఉద్యాన పంటలు కూడా సాగు సాగేలా, దానికి అనుగుణంగా వ్యవసాయ శాఖ సమాయత్తం కావాలిన్నారు. పత్తి, కంది సాగును మరింత ప్రోత్సహించాలిన్నారు. అందుబాటులో వివిధ పంటల సాగుకు అవసరమయ్యే 18 లక్షల క్వింటాళ్ల విత్తనాలు ఉంచాలన్నారు. సేంద్రీయ సాగు, భూసారాన్ని దృష్టిలో ఉంచుకుని పచ్చిరొట్ట విత్తనాల సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. దీనికి రూ.76.66 కోట్లు నిధుల విడుదల చేయనునట్లు తెలిపారు. నానో యూరియా, నానో డీఎపీ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించాలన్నారు. వ్యవసాయ అవసరాలలో డ్రోన్ వినియోగంపై యువతకు అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయిల్ పామ్ సాగులో అంతర పంటల సాగుకై డీసీసీబీల ద్వారా ఎకరానికి రూ.40 వేలు వరకు పంటరుణాలు అందించాలన్నారు. రైతులకు ఇచ్చే సాంకేతిక సూచనలు, సమాచారం సోషల్ మీడియాల్లో విస్తృతంగా ప్రచారం చేయాల్సిందిగా అధికారులకు సూచించారు. నిరంతరం రైతులకు శిక్షణ, వ్యవసాయ సాంకేతిక సమాచారం, ప్రకటనలపై దృష్టిపెట్టాలన్నారు. వానాకాలం సాగు సమయంలోనే యాసంగి వరిసాగు నారుమళ్లకు అవసరమయ్యే భూమిని వదులుకోవాలని కోరారు. మార్చి చివరి వరకు యాసంగి కోతలు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటే వడగళ్ల వానల నుండి నష్టాన్ని నివారించవచ్చున్నారు. తక్కువ కాలంలో అధిక దిగుబడులు ఇచ్చే నూతన వరి వంగడాలను రైతులకు అందేలా చూడాలిని అధికారులను ఆదేశించారు. వరిలో నారుమడి కాకుండా నేరుగా విత్తనాలు వేసే పద్దతులను ప్రోత్సహించాలన్నారు. దీనివల్ల వరి సాగులో 10 నుండి 15 రోజుల వరకు సమయం ఆదా అవుతుందిని అన్నారు. బాన్స్ వాడ, బోధన్, హుజూర్ నగర్, మిర్యాలగూడల మాదిరిగా వరి సాగు సీజన్ ముందుకు జరపాలిని ఆకాంక్షించారు. నేల ఆరోగ్యాన్ని కాపాడడానికి ఫాస్ఫేట్ సాల్యుబుల్ బ్యాక్టీరియా వాడకాన్ని ప్రోత్సహించాలన్నారు. వానాకాలానికి అవసరమైన ఎరువులు అందుబాటులో ఉంచాలన్నారు. జిల్లాల వారీ అవసరాన్ని బట్టి ఎరువుల పంపిణీ చేయాలనీ అధికారులను ఆదేశించారు. రైతువేదికలలో నిరంతర సమావేశాల ద్వారా వ్యవసాయ విస్తరణలో రైతులను విరివిగా భాగస్వామ్యం చేయాలన్నారు. నకిలీ విత్తన పంపిణీ దారులపై కఠినచర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో హాజరైన రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, వివిధ కార్పోరేషన్ల చైర్మన్లు కొండబాల కోటేశ్వర్ రావు, మార గంగారెడ్డి, కొండూరు రవీందర్ రావు, సాయిచంద్, తిప్పన విజయసింహారెడ్డి, మచ్చా శ్రీనివాస్ రావు, రాజావరప్రసాద్ రావు, రామకృష్ణారెడ్డి, ఉద్యానశాఖ డైరెక్టర్ హన్మంతరావు, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమీషనర్ హన్మంత్ కొండిబ, వీసీ నీరజా ప్రభాకర్, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి,,రిజిస్ట్రార్ సుధీర్ కుమార్, ఎండీలు కేశవులు, యాదిరెడ్డి, సురేందర్, జితేందర్ రెడ్డి, రాములు, మురళీధర్, అరుణ, జేమ్స్ కల్వల తదితరులు ఉన్నారు.