కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మళ్లీ యాక్టివ్ అవుతున్నారా..? ఎమ్మెల్యే వద్దు…ఎంపీగా పోటీనే ముద్దు అన్న ఆలోచన చేస్తున్నారా? పాదయాత్రలో పదే పదే పొన్నం ప్రభాకర్‌ను రేవంత్‌రెడ్డి పొగిడిరది అందుకేనా ? ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పనితీరుపై పొన్నం సమీక్ష చేస్తున్నారా? అనే మరిన్ని విషయాలనులో తెలుసుకుందాం..
2014 నుంచి పొన్నంకు వరుస ఓటములు : ఉమ్మడి రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌కు సొంత రాష్ట్రంలో రాజకీయంగా కాలం కలిసిరాలేదు. 2014 నుంచి ఆయన వరుసగా ఓటములను చవిచూస్తున్నారు. 2009 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచిన పొన్నం ప్రభాకర్ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. విభజన బిల్లు సమయంలో పెప్పర్ స్ప్రేకు గురై….తెలంగాణలో ఒక్కసారిగా మరింత ఇమేజ్ పెంచుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెండోసారి ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత ఎంపీల ఫోరంకు పొన్నం ప్రభాకర్‌ను కన్వీనర్‌ను చేశారు. ఎంపీల ఫోరం కన్వీనర్‌గా పొన్నం బాధ్యతలు నిర్వర్తించి ఔరా అనిపించుకున్నారు. అనేక సభా వేదికల మీద పొన్నంను గులాబీబాస్ కేసీఆర్ పలుసార్లు పొగిడారు. ఇలా ఉమ్మడి రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన పొన్నం ప్రభాకర్.. ఇప్పుడు సొంత రాష్ట్రంలో రాజకీయంగా అనేక ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు. ఎంపీల ఫోరం కన్వీనర్‌గా కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని పొన్నం ప్రభాకర్ గట్టిగా వినిపించారు. తెలంగాణ ఉద్యమతీవ్రతను వారి దృష్టికి తీసుకెళ్లారు.
అనూహ్యంగా విజయం సాధించిన బండి సంజయ్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన తొలి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ సులభంగా గెలుస్తుందనుకున్న ఎంపీ సీట్లలో కరీంనగర్ ముందు వరుసలో ఉంటుందని అంతా అనుకున్నారు. కరీంనగర్ ఎంపీగా రెండోసారి పోటీ చేసిన పొన్నం ప్రభాకర్ అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో దెబ్బలు తిని, పార్లమెంట్‌లో పెప్పర్ స్ప్రేకు గురైన పొన్నంను కరీంనగర్ ప్రజలు ఓడిరచడం అప్పట్లో సంచలనమైంది. 2014 ఎంపీ ఎన్నికల్లో ఓడిపోయిన పొన్నం ప్రభాకర్…ఆ తర్వాత జరిగిన ముందస్తు ఎన్నికల్లో అంటే 2018లో కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి మరో ఓటమిని చవిచూశారు. రెండుసార్లు ఓడిన సానుభూతి పని చేస్తుందని భావించిన పొన్నం ప్రభాకర్ ….2019లో ఎంపీ ఎన్నికల్లో పోటీ చేశారు. అయినా కూడా ప్రజలు పొన్నం ప్రభాకర్‌ను ఆదరించలేదు. ఆయన వైపు చూడలేదు. ఆ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన బండి సంజయ్ అనూహ్యంగా విజయం సాధించారు. ఇక ముచ్చటగా మూడోసారి ఓడిన పొన్నం ప్రభాకర్ తర్వాత తీవ్ర సంతృప్తికి లోనయ్యారు. వరుస ఓటములు ఎదురైనా కాంగ్రెస్ పార్టీని వీడకుండా.. పార్టీ బలోపేతానికి శ్రమిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీని పటిష్టం చేసే దిశగా పనిచేస్తున్నారు.
ఈసారి ఎంపీగానే పోటీ చేయాలని యోచన : వాయిస్: పొన్నం ప్రభాకర్ మరోసారి ఎన్నికల బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ ఏడాది తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది పార్లమెంట్‌కు ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే ఎమ్మెల్యేగా పోటీ చేసి తప్పు చేశానని భావించిన పొన్నం ప్రభాకర్.. ఈ సారి ఎంపీకే పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ అసెంబ్లీ స్థానంలో అటు బిజేపీ, ఇటు బీఆర్‌ఎస్ నుంచి టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. దీంతో పార్లమెంట్‌కు పోటీ చేస్తేనే బాగుంటుందన్న చర్చ ఆయన అనుచరుల్లో జరుగుతోంది. అందుకే ఆయన కరీంనగర్ లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో సిరిసిల్ల నుంచి హుస్నాబాద్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ప్రజలతో మమేకమై నడిచారు. ఏడు నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో ముఖ్య కార్యకర్తల సమావేశాలు పెట్టుకుంటున్నారు. కరీంనగర్‌లో అటు బిజేపీ, ఇటు బీఆర్‌ఎస్ బలంగా ఉండడంతో కాంగ్రెస్ తీవ్ర కష్టాలు ఎదుర్కొంటోంది. అయితే ఇటీవల ఈ ఏడు నియోజకవర్గాల్లో పీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డి పాదయాత్ర విజయవంతం అయింది. ఈ ఏడు నియోజకవర్గాల్లో జరిగిన సభల్లో పొన్నం ప్రభాకర్‌ను రేవంత్ రెడ్డి ఆకాశానికి ఎత్తారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి పొన్నం ఎంతో కృషి చేస్తున్నారని ప్రశంసించారు.
ఇప్పటికే ఖరారైన కాంగ్రెస్ అభ్యర్థులు..! : 2018లో చేసిన తప్పును మరోసారి చేయకుండా ఎంపీగా పోటీ చేస్తేనే బాగుంటుందని పొన్నం ప్రభాకర్ కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్క కరీంనగర్ మినహా మిగతా ఆరు నియోజకవర్గాల్లో ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారయ్యారు. వారిని సమన్వయం చేసుకుంటూ… లోక్‌సభ ఎన్నికల నాటికి పుంజుకోవాలని పొన్నం ప్రభాకర్ భావిస్తున్నారట. వాస్తవంగా 2018 ఎన్నికల కంటే ముందే పొన్నం ప్రభాకర్‌ను గులాబీ బాస్ కేసీఆర్ బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. రాజకీయంగా ఇబ్బంది ఎదుర్కొంటున్నప్పటికీ ఆయన మాత్రం కాంగ్రెస్‌ను వీడలేదు. 2018 ఎన్నికల్లో ఓడినా… 2019లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో పొన్నం ప్రభాకర్ కరీంనగర్ నుంచే బరిలో నిలుచుంటారని ఆయన అనుచరులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా…కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్….పార్టీని బలోపేతం చేస్తున్నారు. కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ ముందుకుసాగుతున్నారు. మొత్తానికి సిట్టింగ్ బీజేపీ ఎంపీని కాదని, బలమైన బీఆర్‌ఎస్ అభ్యర్థి వినోద్‌కుమార్‌ను పక్కన పెట్టి.. పొన్నం ప్రభాకర్‌ను జనం ఆదరిస్తారా..? పొన్నం ప్రభాకర్‌కు కనీసం ఈ సారైనా కాలం కలిసి వస్తుందా లేదో చూడాలి.