సింగరేణి బొగ్గుకు పెరిగిన ఆదరణ


గోదావరిఖని : సింగరేణి బొగ్గు మార్కెట్‌ విస్తరిస్తోంది.. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లోని ఎన్టీపీసీ ప్రాజెక్టులకు 13.53 మిలియన్‌ టన్నుల బొగ్గును సింగరేణి సరఫరా చేస్తోంది. తాజాగా మహారాష్ట్రలోని షోలాపూర్‌ ఎన్టీపీసీ ప్రాజెక్టుకు 2.54 మిలియన్‌ టన్నుల బొగ్గు రవాణాకు తాజాగా ఒప్పందం కుదిరింది. ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టుకు 6.85 మిలియన్‌ టన్నుల సరఫరాకు నవంబరు 10న సింగరేణి యాజమాన్యంతో ఎన్టీపీసీ సంస్థ ప్రతినిధులు ఒప్పందం చేసుకోగా, తాజాగా మహారాష్ట్రలోని షోలాపూర్‌ పవర్‌ ప్లాంటుకు అంగీకారం కుదుర్చుకున్నారు. దీంతెఓ మార్కెట్‌లో మరింత పట్టు సాధించినట్లయింది.
ఎన్టీపీసీకి నమ్మకం
ఎన్టీపీసీ సంస్థ సింగరేణి బొగ్గు తీసుకునేందుకు ముందుకొస్తోంది.. సింగరేణిపై పూర్తి నమ్మకం ఉండటంతో మిగతా సంస్థలతో అవకాశం ఉన్నా వాటిని పక్కనపెట్టి సింగరేణితో అంగీకారం కుదుర్చుకుంటోంది. మహారాష్ట్రలోని ఎన్టీపీసీ సంస్థకు కోల్‌ ఇండియా నుంచి తీసుకోవాల్సి ఉన్నప్పటికీ దాన్ని పక్కన పెట్టి సింగరేణి ద్వారా తీసుకోవడానికి ఆసక్తి చూపింది. దీనికోసం కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి తీసుకుంది. అదేవిధంగా ఇదివరకే ఒప్పందం చేసుకున్న తెలంగాణ ఎన్టీపీసీ ప్రాజెక్టుకు కూడా మొదట మందాకిని కోల్‌బ్లాకు నుంచి బొగ్గు సరఫరాకు అవగాహన చేసుకుంది. ప్రస్తుతం దాన్ని రద్దు చేసుకుని సింగరేణితో అంగీకారం కుదుర్చుకుంది.
ఎనిమిది రాష్ట్రాలకు బొగ్గు రవాణాఎన్టీపీసీ ప్లాంటున్న ఎనిమిది రాష్ట్రాలకు సింగరేణి సంస్థ బొగ్గు రవాణా చేస్తోంది. ఇదివరకే కర్ణాటక, చత్తీస్‌ఘడ్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌తో పాటు తాజాగా మహారాష్ట్రలోని విద్యుత్తు కేంద్రాలకు సరఫరా చేస్తోంది. దేశవ్యాప్తంగా మార్కెట్‌ను విస్తరించుకుంటూ వస్తున్న సింగరేణికి ఎన్టీపీసీ సంస్థ అతిపెద్ద వినియోగదారు.. 13.53 మిలియన్‌ టన్నుల వరకున్న బొగ్గు సరఫరా తాజాగా 2.54 మిలియన్‌ టన్నులకు చేరింది. దీంతో మొత్తం ఎన్టీపీసీకి 16.07 మిలియన్‌ టన్నుల బొగ్గు సరఫరాకు ఒప్పందం కుదిరినట్లయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *