సచివాలయ మొట్టమొదటి సమీక్షా సమావేశంలో తాగునీరు, జలాశయాలకు నీరు సత్వరం అందించేలా చర్యలు… సీఎం కెసిఆర్

నూతనంగా నిర్మించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై మొట్టమొదటి సమీక్షా సమావేశం నిర్వహించారు. సుప్రీంకోర్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో తాగునీటి పనులను కొనసాగించడానికి అనుమతించిన నేపథ్యంలో ఈ రోజు సమీక్షా సమావేశంలో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో తాగునీటి సరఫరాకు సంబంధించిన పనుల పురోగతిపై ముఖ్యమంత్రి కూలంకంషంగా చర్చించారు. ఇందులో భాగంగా జూలై వరకు కరివెన జలాశయంకు నీళ్ళు తరలించాలని, ఆగష్టు వరకు ఉద్దండాపూర్ వరకు నీటిని ఎత్తిపోయాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో నార్లపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్దండాపూర్ జలాశయాలకు సంబంధించి మిగిలిపోయిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, వాటి సంబంధిత పంప్ హౌజ్ లు, విద్యుత్ సబ్ స్టేషన్లు, ఒక రిజర్వాయర్ నుంచి మరొక రిజర్వాయర్ కు నీటిని తరలించే ‘కన్వేయర్ సిస్టమ్’ లో మిగిలిన పనులను కూడా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పాలమూరు జిల్లాలో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ పనులకు సంబంధించిన పురోగతిపై కూడా ముఖ్యమంత్రి సమీక్షించారు. వాటిలో మిగిలిన కొద్దిపాటి పనులను ఈ జూన్ లోగా పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు చెందిన మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *