నిన్న మొన్నటి వరకూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్ ఎంతో అన్యోన్యతగా ఉంటూ వచ్చారు. ఇరువురూ కూర్చోని విభజన సమయంలో ఇచ్చుపుచ్చుకోవాల్సినవన్నీ లెక్కలు తేల్చేసుకున్నారు. ఈ మధ్య ఎందుకో ఇద్దరి మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. దీనికి కారణాలు చాలానే ఉన్నాయని వైసీపీ, బీఆర్‌ఎస్ చెబుతున్నాయి. ఇదే టైమ్‌లో ఏపీలో విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ తెలంగాణలో సింగరేణిని కేంద్రం ప్రైవేటీకరణ చేయబోతోందన్న వార్తలు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆందోళనలో పడేశాయి. ఈ పరిస్థితుల్లో స్టీల్ ఫ్యాక్టరీని ఆదుకుంటామని.. బిడ్ వేయడానికి సిద్ధంగా ఉన్నామని కేసీఆర్ సర్కార్ చేసిన ఒకే ఒక ప్రకటన ఇప్పుడు పెను సంచలనమే అయ్యింది. అయితే.. అసలు తెలంగాణ ప్రభుత్వానికి ఆ అర్హతే లేదని ఏపీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకం అయినప్పుడు బిడ్డింగ్‌లో తెలంగాణ సర్కార్ ఎలా పాల్గొంటుంది..? అని ప్రశ్నిస్తోంది. జగన్ ప్రభుత్వం మాత్రం ప్రైవేటీకరణకు వ్యతిరేకమని తేల్చి చెప్పేసింది వైసీపీ. దీంతో ఇన్నాళ్లుగా కలిసి మెలిసిన వైసీపీబీఆర్‌ఎస్ ప్రభుత్వాలు ఇప్పుడు ఒక్కసారిగా వైరిగా మారిపోయాయ్. తెలంగాణ మంత్రులు కేటీఆర్ ఒకలా.. హరీష్ రావు ఆంధ్రుల మాట్లాడిన మాటలు వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతకీ ఈ ఇద్దరు మంత్రులు ఏమన్నారు..? ఉద్యమ సమయంలో ఈ ఇద్దరే ఎలాంటి కామెంట్స్ చేశారు..? అని చూస్తే...విశాఖ స్టీల్ ప్లాంట్ చుట్టూ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు నడుస్తున్నాయి. స్టీల్ ప్లాంట్‌ను కాపాడేందుకే బిడ్డింగ్‌లో పాల్గొంటున్నామని స్వయంగా మంత్రి కేటీఆర్ ప్రకటించారు. దీంతో తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ రగడ మొదలయ్యింది. సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఓ బృందాన్ని కూడా పంపింది. అయితే.. అస్సలు తెలంగాణ ప్రభుత్వం బిడ్ వేయడమనేది జరిగే పని కాదని ప్రైవేటీకరణకు వ్యతిరేకం అనేవాళ్లు బిడ్ ఎలా వేస్తారని ఏపీ ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. అంతేకాదు.. బిడ్డింగ్‌కు అర్హతే లేదని కేంద్ర ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ శాఖ చెబుతోంది. దీంతో ఒక్కసారిగా ఏపీ తెలంగాణ మంత్రులు కేటీఆర్
గుడివాడ అమర్నాథ్ మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. అయితే.. ఏపీలో బీఆర్‌ఎస్‌లో పాగా వేయాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే జగన్ సర్కార్‌ను ఇరుకున పెట్టేందుకు ప్రజల్లో సానుభూతి పొందాలనే కేసీఆర్ సర్కార్ పక్కా వ్యూహంతో అడుగులు ముందుకేస్తోందని వార్తలు వస్తున్నాయి. రాజకీయాల్లో అపర చాణక్యుడిగా పేరుగాంచిన కేసీఆర్.. అంత ఆషామాషీగా ఏ పనిచేయరని.. ఒక్కసారి అనుకుంటే మాత్రం కథ వేరేలే ఉంటుందని ఆయన్ను దగ్గర్నుంచీ చూసినవాళ్లు చెబుతుంటారు. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా కేసీఆర్ ముందుస్తు వ్యూహంతోనే చేస్తున్నారనే కామెంట్స్ కూడా వస్తున్నాయ్. మరోవైపు.. ఇదిలా నడుస్తుండగానే వైసీపీ`బీఆర్‌ఎస్ పార్టీలు రహస్య అవగాహనతోనే ఇదంతా చేస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సడన్‌గా హరీష్ ఇలా ఎందుకో..!
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై పాలిటిక్స్ నడుస్తుండగానే మంత్రి హరీష్ రావు సడన్‌గా స్వరం మార్చేశారు. తెలంగాణలోని ఏపీ కార్మికులు ఆంధ్రాలో ఓటు రద్దు చేసుకోవాలని.. ఇక్కడ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. అంతేకాదు.. కార్మికుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పాటుపడుతోందని.. ఏపీ, తెలంగాణలో ఎవరి పాలన బాగుంది? అనేది ప్రజలే చెప్పాలని కూడా అనేశారు. ఏపీ, తెలంగాణకు.. భూమి, ఆకాశానికి ఉన్నంత తేడా..? అని హరీష్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పటికే భగ్గుమనే పరిస్థితులు ఉండగా.. అగ్గిగి ఆజ్యం పోసినట్లుగా అయ్యాయి. అయితే హరీష్ కామెంట్స్‌పై సోషల్ విూడియా వేదికగా ఆంధ్రాకు చెందిన నెటిజన్లు, వైసీపీ కార్యకర్తలు, జగన్ వీరాభిమానులు తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నారు. ఉద్యమ సమయంలో ఆంధ్రోళ్లను, ముఖ్యంగా ఉద్యోగస్తులపై హరీష్ దాడి చేసిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ విమర్శిస్తున్నారు. ఒక్క హరీష్ కామెంట్సే కాదు.. కేసీఆర్, కేటీఆర్ వ్యాఖ్యలను సైతం వైసీపీ కార్యకర్తలు వైరల్ చేస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత కూడా రాష్ట్రంలో ఆంధ్రోళ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయో అన్నీ గమనిస్తున్నామని విద్య, ఉద్యోగాల విషయంలో.. మరీ ముఖ్యంగా పోలవరం, కరోనా టైమ్‌లో అంబులెన్స్‌ల వ్యవహారం ఇలా ఒకట్రెండు కాదు లెక్కలేనన్ని విషయాలను సోషల్ విూడియాలో ప్రస్తావనకు తెస్తున్నారు. ఇన్ని చేసిన కేసీఆర్ సర్కార్ ఇప్పుడు బిడ్డింగ్ అని.. ఓటు మార్చుకోవాలని చెప్పడం ఏంటి..? అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.
మొత్తానికి చూస్తే.. ఏపీలో బీఆర్‌ఎస్‌ను బలోపేతం చేయడానికి, అవసరమైనప్పుడు పాగా వేసేయాలని కేసీఆర్ పక్కాగానే ముందుకెళ్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇదంతా వైసీపీ, బీఆర్‌ఎస్ మైండ్ గేమ్ అనే కామెంట్స్ కూడా వస్తున్నాయ్. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లో మున్ముందు ఇంకా ఏమేం జరుగుతాయో.. పరిస్థితులు ఎంతవరకూ వెళ్తాయో వేచి చూడాల్సిందే మరి.