వేసవి సెలవుల్లోనే పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయాలి – యుయస్పీసి


పాఠశాలల పునఃప్రారంభం లోపు ఉపాధ్యాయుల పదోన్నతులు నిర్వహించి, నియామకాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుయస్పీసి) రాష్ట్ర స్టీరింగ్ కమిటీ డిమాండ్ చేసింది.
యుయస్పీసి రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సమావేశం ఆదివారం టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో కె జంగయ్య అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర విద్యారంగంలో నెలకొన్న పరిస్థితులను సమీక్షించింది. ఉపాధ్యాయుల బదిలీల జిఓపై హైకోర్టు స్టే కొనసాగుతున్నందున మొత్తం ప్రక్రియ నిలిచిపోయింది. పాఠశాలల్లో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విద్యా సంవత్సరం అస్తవ్యస్తంగా నడుస్తున్నది. పదోన్నతులు, నియామకాల ద్వారానే ఖాళీ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుంది. కనుక బదిలీలపై హైకోర్టు తీర్పు వచ్చేలోగా తాత్కాలిక ప్రాతిపదికన పదోన్నతులు చేపట్టాలని, తద్వారా ఏర్పడిన ఖాళీల్లో నియామకాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని యుయస్పీసి డిమాండ్ చేసింది.
ఇప్పటికే ఐదు రాష్ట్రాల్లో సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్దరించారని, సిపిఎస్ రద్దు వాగ్దానం చేసి హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, కేంద్ర బిజెపి విధానాలను వ్యతిరేకిస్తూ పోరాడుతున్న బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో సిపిఎస్ రద్దుచేసి పాత పెన్షన్ పునరుద్దరించాలని యుయస్పీసి డిమాండ్ చేసింది. అన్ని యాజమాన్యాల ఉపాధ్యాయులకు నెల మొదటి తేదీన వేతనాలు ఇవ్వాలని, ట్రెజరీల్లో ఆమోదం పొంది ఏడాదిగా ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లులన్నింటినీ వెంటనే మంజూరు చేయాలని, బకాయి ఉన్న మూడు డిఎలను ప్రకటించాలని, జులై 1, 2023 నుండి నూతన వేతన సవరణ అమలు జరిగే విధంగా తెలంగాణ రెండవ పిఆర్సీ పై నిర్ణయం తీసుకోవాలని యుయస్పీసి డిమాండ్ చేసింది.
పై సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలన్నీ జెఎసిగా ఏర్పడి ఐక్యంగా ఉద్యమిస్తే సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందని అందుకు యుయస్పీసి గా అన్ని సంఘాలతో చర్చించటానికి చొరవ తీసుకోవాలని సమావేశం తీర్మానించింది.
ఈ సమావేశంలో యుయస్పీసి స్టీరింగ్ కమిటీ సభ్యులు కె జంగయ్య, చావ రవి, వై అశోక్ కుమార్, ఎం రవీందర్, ఎం సోమయ్య, టి లింగారెడ్డి, కొమ్ము రమేష్, ఎన్ యాదగిరి, జాడి రాజన్న, మేడి చరణ్ దాస్, కె భిక్షపతి, తులసీరాం తదితరులు పాల్గొన్నారు.
కృతజ్ఞతలతో….
స్టీరింగ్ కమిటీ
యుయస్పీసి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *