వర్ణ, కుల, లింగవివక్ష లేని సమాజం కోసం 900 ఏండ్ల క్రితమే పోరాడిన సామాజిక దార్శనికుడు బసవేశ్వరుడు… సీఎం కెసిఆర్.

సామాజిక, ఆధ్యాత్మిక విప్లవకారుడు, సమ సమాజ స్థాపనకోసం కృషి చేసిన భారతీయ దార్శనికుడు, నాటి కాలం ప్రజా నాయకుడు బసవేశ్వరుని జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని వీరశైవ లింగాయత్ లు, లింగ బలిజలు సహా రాష్ట్ర మరియు దేశ ప్రజలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఆనాటి సమాజంలో నెలకొన్న మత చాందస విలువలను సంస్కరిస్తూ, సాంఘీక దురాచారాలమీద పోరాటం చేయడమేకాకుండా, వర్ణ వివక్ష, కుల వివక్ష, లింగవివక్ష లేని సమాజం కోసం దాదాపు 900 ఏండ్ల క్రితమే పోరాడిన సామాజిక దార్శనికుడు బసవేశ్వరుడు అని సీఎం కొనియాడారు. ‘అనుభవ మంటపం’ వ్యవస్థను ఏర్పాటు చేసి, అన్ని కులాలకు అందులో ప్రాతినిధ్యం కల్పించి, నాటి కాలంలోనే పార్లమెంటరీ ప్రజాస్వామిక పాలనకు బీజాలు వేశారన్నారు. బసవేశ్వరుని జయంతిని ఏటా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ, వారి ఆశయాల సాధన దిశగా కార్యాచరణ చేపట్టిందని సీఎం తెలిపారు. బసవేశ్వరుని స్ఫూర్తిని రేపటి తరాలు కొనసాగించేందుకు గుర్తుగా వారి కాంస్య విగ్రహాన్ని ట్యాంకుబండుమీద నెలకొల్పుకున్నామన్నారు. హైదరాబాద్, కోకాపేట ప్రాంతంలో బసవ భవన్ నిర్మాణానికి 10 కోట్ల రూపాయల నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని సీఎం తెలిపారు. కుల, మతాలకు అతీతంగా మనుషులంతా ఒక్కటేననే బసవేశ్వరుని సమతా తాత్వికతను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తుందని సీఎం అన్నారు. దళిత బహుజన కులాల గిరిజన, మహిళా అట్టడుగు వర్గాల సంక్షేమం అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తూ బసవేశ్వరుని ఆశయాలను కొనసాగిస్తామని సీఎం స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *