
అంతులేని నిరుద్యోగం, అదే సమయంలో భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి బాటలో… ఏమిటి అంతర్యం. ఆసక్తితో దీనిగురించి పరిశీలన చేద్దాం. ఏ దేశమైనా అభివృద్ధి చెందుతుంది అంటే ఆ దేశ శ్రామికశక్తి, వ్యవసాయరంగం నుంచి పారిశ్రామిక, సేవా రంగాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతూ, తలసరి ఆదాయం తద్వారా జీడీపీ వృద్ధి చెందుతుందని అర్థం. కానీ దీనికి విరుద్ధంగా భారతదేశంలో ప్రస్తుతం పారిశ్రామిక రంగాల నుంచి శ్రామికశక్తి, వ్యవసాయ రంగం వైపు పయనిస్తోంది.ప్రతీ సంవత్సరం నూతనంగా 1.2 కోట్ల మంది శ్రామిక జనాభాగా చేరుతున్నారు. వీరిలో కేవలం 55 లక్షల మందికి మాత్రమే ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి. 2022 లో ఉద్యోగం కోసం వెతుకుతున్న వారు సుమారు 10 మిలియన్ల మంది ఉండగా, కేవలం ఒక మిలియన్ వారికి మాత్రమే ఉపాధి లభిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగం నిర్మూలనకు కొన్ని చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా విద్యా వ్యవస్థలో ఒకేషనల్ కోర్సులు అభివృద్ధి పరచాలి. నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేయాలి. పెద్దపెద్ద పెట్టుబడి, మెషనరీ టెక్నాలజీ ద్వారా ఉత్పత్తి చేసే రంగాలకు ప్రాధాన్యత తగ్గించి, లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్లకు ప్రాధాన్యత పెంచాలి. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నేటి విద్యా విధానం, సబ్జెక్టులు ప్రవేశపెట్టాలి. ఖాళీ పోస్టుల భర్తీ చేయాలి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కు ప్రాధాన్యత ఇవ్వాలి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం నూతన టెక్నాలజీ అభివృద్ధి పరచాలి. ప్రభుత్వ విధానాలను సవిూక్ష చేసుకుని, శ్రామిక శక్తి ద్వారా ఉత్పత్తి రంగాల్లో వస్తు ఉత్పత్తికి ప్రాధాన్యత పెంచాలి.సీఎంఐఈ, సీఈడిఏ నివేదికల ప్రకారం 2016-17 నుంచి 2021-22 మధ్య కాలంలో 5.2 కోట్ల నుంచి 2.7 కోట్ల మంది తయారీ (పారిశ్రామిక) రంగాల నుంచి తగ్గారు. అంటే దాదాపు 50% తగ్గుదల సంభవించింది. టెక్స్టైల్స్, బిల్డింగ్ నిర్మాణం, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో ఉపాధి క్షీణత ఎక్కువగా ఉంటుంది. 2016-17 నుంచి 2021-22 మధ్య సంవత్సరాల్లో ఒక్క టెక్స్టైల్స్ రంగంలోనే 1.2 కోట్లుగా ఉన్న శ్రామికుల సంఖ్య 55 లక్షలకు చేరింది. గమ్మతైన విషయం ఏమిటంటే, ‘లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్ నుంచి క్యాపిటల్ ఇంటెన్సివ్’ వైపు భారత్ ఆర్థిక వ్యవస్థ పయనిస్తోంది. ఇది ప్రమాదకరమైన పరిస్థితి. కేవలం నూతన మెషినరీ, టెక్నాలజీ ద్వారా వస్తు ఉత్పత్తి చేస్తూ, పెద్ద పెద్ద పెట్టుబడిదారుల చేతిలో బడా పారిశ్రామిక సంస్థలు ఉండటంతో, శ్రామిక జనాభాకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోయినా, వృద్ధి బాటలో ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతోంది. దీంతో శ్రామిక జనాభా వ్యవసాయ రంగంలోకి వెనుదిరిగారు. అజీజ్ ప్రేమ్‌జీ నివేదిక ప్రకారం దేశంలో నిరుద్యోగం ఆకాశాన్ని తాకుతుందని తెలిపింది.2018 ఉత్తర ప్రదేశ్‌లో కేవలం ఐదవ తరగతి అర్హత కలిగిన 62 టెలిఫోన్ మెసెంజర్ పోస్టులకు 92,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారు ఉన్నారు. అలాగే రైల్వే గ్యాంగ్ మెన్, పోర్టర్ వంటి 67,000 పోస్టులకు 1.9 కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నారు. కొన్ని హోటల్స్‌లో కేవలం 4వ తరగతి అర్హత కలిగిన వెయిటర్ వంటి పోస్టులకు కూడా వేల సంఖ్యలో డిగ్రీ చదివిన వారు దరఖాస్తు చేసుకోవడం విస్మయం కలిగిస్తోంది. అంటే నిరుద్యోగం ఎంత తీవ్రంగా ఉందో కనపడుతుంది. గత యూపీఏ ప్రభుత్వం నుంచి నేడు ఎన్డీఏ ప్రభుత్వం వరకూ దేశవ్యాప్తంగా నిరుద్యోగం పెరుగుతూ వస్తోంది. మేక్ ఇన్ ఇండియా, పీఎం స్కీం వంటి పథకాలు ఎన్ని వచ్చినా, దేశంలో శ్రామిక జనాభాకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించడం లేదు. అయితే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ఉచితాలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న క్రమంలో కొంతమేరకు ఉపశమనం కలుగుతోంది. దేశ సగటు కంటే మూడు రెట్లు అధికంగా వివిధ రాష్ట్రాల్లో నిరుద్యోగం పెరుగుతోంది.ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో స్థాపించే పరిశ్రమలకు యువ జనాభాకు, శ్రామిక శక్తికి పెద్ద పీట వేయడం ద్వారా నిర్మాణాత్మక రీతిలో, శాశ్వత ప్రాతిపదికన ఆర్థిక అభివృద్ధి సాధించవచ్చు. కేవలం సేవా రంగం, రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయం, అభివృద్ధి తాత్కాలికమే అని భావించాలి. ఇది గాలి బుడగ వంటిది. కాబట్టి ప్రజల జీవితాల్లో నిజమైన అభివృద్ధి అంటే వారి తలసరి ఆదాయం పెరుగుదల మాత్రమే. జీవన ప్రమాణాలు మెరుగుపడాలి. ద్రవ్యోల్బణం తగ్గాలి. ధరలు అందుబాటులో ఉండాలి. ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు అండగా కాకుండా, పేద మధ్య తరగతి ప్రజల జీవితాలు మెరుగుపడే విధానాలకు అనుగుణంగా వివిధ పథకాలను ప్రవేశపెట్టి, శాశ్వత ప్రాతిపదికన దేశం ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేసే విధంగా ప్రయత్నాలు ముమ్మరం చేయాలి.