మెదక్‌-ఎల్కతుర్తి జాతీయ రహదారి పనులకు మోక్షం…. నిర్మాణ పనులకు నిధులు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం…

మెదక్‌-ఎల్కతుర్తి జాతీయ రహదారి పనులకు మోక్షం లభించింది. 133.61 కిలోమీటర్ల ఈ రహదారిని రెండు ప్యాకేజీలుగా విభజించిన కేంద్ర ప్రభుత్వం నిర్మాణ పనులకు నిధులు విడుదల చేసింది. మొదటిప్యాకేజీగా మెదక్‌-సిద్దిపేట వరకు 69.97 కి.మీ. రహదారిని, రెండో ప్యాకేజీలో సిద్దిపేట-ఎల్కతుర్తి వరకు 63.64 కి.మీ. రోడ్డును నిర్మించనున్నారు. మొదటి దశలో సిద్దిపేట- ఎల్కతుర్తి వరకు జాతీయ రహదారి నిర్మాణానికి రూ.578.85 కోట్లను జాతీయ రహదారులశాఖ విడుదల చేసింది. ఐదేళ్ల క్రితమే ఈ రోడ్డుకు జాతీయ హోదా కల్పించినప్పటికీ పనులు ముందుకు సాగలేదు. మెదక్‌ నుంచి సిద్దిపేట, హుస్నాబాద్‌ మీదుగా ఎల్కతుర్తి వరకు 134 కి.మీల రోడ్డును జాతీయ రహదారిగా ప్రకటిస్తూ ఎన్‌హెచ్‌ 765 డీజీ నంబరును కేటాయించారు. మెదక్‌ నుంచి సిద్దిపేట వరకు మొదటి ప్యాకేజీగా, సిద్దిపేట నుంచి ఎల్కతుర్తి వరకు రెండో ప్యాకేజీగా విభజించారు. తాజాగా సిద్దిపేట నుంచి ఎల్కతుర్తి వరకు రెండో ప్యాకేజీ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే మెదక్‌-సిద్దిపేట మొదటి ప్యాకేజీకి రూ.882.18 కోట్లు ఖర్చవుతుందని ప్రణాళిక సిద్ధం చేసినా నిధులపై అధికారిక ప్రకటన రాలేదు. కేంద్ర మం త్రి నితిన్‌గడ్కరీ రూ.882.18కోట్ల పనులకు నిధులు మంజూరు తెలిపినట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. త్వరలోనే టెండర్లుసిద్దిపేట-ఎల్కతుర్తి మధ్య హైవే విస్తరణ పనులకు 578.85 కోట్లను వెచ్చించనున్నారు. మొదటి దశలో రూ.223 కోట్లు విడుదల చేయనున్నారు. 2022-25లోగా పనులు పూర్తిచేసేలా త్వరలోనే టెండర్లు పిలువనున్నారు. ఇందులో రోడ్డు విస్తరణకు సం బంధించిన భూసేకరణ, పరిహారం, ఇతర ఖర్చులు కూడా భ రించాల్సిన అవసరం ఉన్నది. సిద్దిపేట నుంచి ఎల్కతుర్తి వరకు ప్రస్తుతం డబుల్‌ రోడ్డు ఉన్నది. నాలుగు లేన్లుగా హైవే నిర్మించే క్రమంలో భూసేకరణ, ఇళ్లు, భూములను కోల్పోతున్న వారికి నష్టపరిహారంపై ఇంకా పూర్తిస్థాయిలో నిర్ణయం తీసుకోలేదు.
రెండు మేజర్‌.. 29 మైనర్‌ బ్రిడ్జిలుహైవే నంబర్‌ 765 డీజీపై కోహెడ మండలం బస్వాపూర్‌, హుస్నాబాద్‌ మండలం పందిల్ల వద్ద వాగులపై రెండు భారీ వంతెనలు నిర్మించనున్నారు. ప్రస్తుతం సాధారణ వర్షాలకే వాగులు ఉప్పొంగి ఇక్కడ రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతున్నది. హైవే విస్తరణ నిర్ణయంతో వాహనదారుల కష్టాలు తొలగిపోనున్నాయి. వీటితో పాటు 26 మైనర్‌ వంతెనలు నిర్మించనున్నారు. 29 కల్వర్టులు, 28 శ్లాబ్‌ కల్వర్టులు, 2 బాక్సు కల్వర్టులు, 15 చైన్‌ కల్వర్టులు కూడా నిర్మించాల్సి ఉంటుంది. ఎల్కతుర్తి వద్ద మేజర్‌ జంక్షన్‌ను నిర్మించి వరంగల్‌-కరీంనగర్‌ హైవేకు అనుసంధానం చేయనున్నారు. 28 చోట్ల మైనర్‌ జంక్షన్లను ఏర్పాటు చేయనున్నారు.
పందిల్ల వద్ద టోల్‌ప్లాజాభారీ వ్యయంతో నిర్మించనున్న జాతీయ రహదారి కోసం వాహనదారుల నుంచి పన్ను వసూలు చేయనున్నారు. సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్‌ మండలం పందిల్ల గ్రామం వద్ద భారీ టోల్‌ప్లాజాను ఏర్పాటు చేయనున్నారు. సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట పట్టణ శివారులోని రంగధాంపల్లి వద్ద హైవే మొదలై మిట్టపల్లి, నంగునూరు మండలం ముండ్రాయి, రాజగోపాల్‌ పేట, పాలమాకుల, బద్దిపడగ, కోహెడ మండలం బస్వాపూర్‌, ఆరెపల్లి, సముద్రాల, కోహెడ క్రాస్‌, హుస్నాబాద్‌ మండలం పందిల్ల, హుస్నాబాద్‌, పోతారం, జిల్లెల్లగడ్డ, హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రాంనగర్‌, గట్లనర్సింగాపూర్‌, ముల్కనూరు, కొత్తపల్లి, ఎల్కతుర్తి మండలం ఇందిరానగర్‌, ఎల్కతుర్తి వరకు విస్తరించి ఉంటుంది.
మెరుగపడనున్న రవాణా సౌకర్యంమెదక్‌ – ఎల్కతుర్తి జాతీయ రహదారి నిర్మాణం పూర్తయితే మెదక్‌, సిద్దిపేట జిల్లాల మధ్య రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. ప్రస్తుతం ఉన్న డబుల్‌ రోడ్డును 10 మీటర్ల వెడల్పుతో విస్తరించడంతో ఇరుకైన గతుకుల రహదారిపై ప్రయాణం తప్పనుంది. నాగ్‌పూర్‌, బోధన్‌ జాతీయ రహదారుల మధ్య కనెక్టివిటీ పెరుగుతుంది. దూరాభారం తగ్గనుంది. కూరగాయలు, పండ్లు, వ్యవసాయ ఉత్పత్తులను పండిరచే రైతులకు జాతీయ రహదారి ఎంతగానో ఉపయోగపడనున్నది. మెదక్‌-సిద్దిపేట మార్గంలో రహదారి ప్రస్తుతం ఏడు మీటర్ల పొడువు ఉండగా ఇరువైపులా మూడు మీటర్ల మేర విస్తరించాల్సి ఉంటుంది. దీంతో భూసేకరణ అవసరం తక్కువగా ఉండవచ్చు. మెదక్‌ నుంచి రామాయంపేట మార్గంలో కొంత అటవీ భూమిని సేకరించాల్సి ఉంటుంది. మరోవైపు జాతీయ రహదారి విస్తరణ పనులతో మెదక్‌-సిద్దిపేట మార్గంలో ప్రస్తుతం రోడ్డుకు ఇరువైపుల ఉన్న భారీ వృక్షాలు కనుమరుగుకానున్నాయి. తొలగనున్న కష్టాలు
-హరీశ్‌రావు, ఆర్థిక, వైద్యఆరోగ్యశాఖ మంత్రి తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధతో రవాణా వ్యవస్థ మెరుగుపడిరది. ప్రస్తుతం సిద్దిపేట నుంచి వరంగల్‌ మార్గంలో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జాతీయ రహదారి నిర్మాణంతో కష్టాలు తొలగనున్నాయి. ఈ రహదారికి నిధుల మంజూరు కోసం మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితోపాటు పలుమార్లు కేంద్ర మంత్రులను కలిసి విన్నివించాము. రవాణా సౌకర్యం మెరుగు
-రఘునందన్‌రావు, దుబ్బాక ఎమ్మెల్యేమెదక్‌-సిద్దిపేట జాతీయ రహదారి విస్తరణతో రవాణా సౌకర్యం మెరుగవుతుంది. జాతీయ రహదారుల మధ్య కనెక్టివిటీ పెరుగుతుంది. సమయం, డబ్బు ఆదా అవుతాయి. దూరభారం తగ్గుతుంది. రామాయంపేటలో అటవీ భూముల సేకరణ కొంత సమస్యగా ఉన్నా అధిగమిస్తాం. రామాయంపేటకు కొత్త బైపాస్‌ రోడ్డు నిర్మాణంపై అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ రోడ్డుతో దుబ్బాక నియోజకవర్గానికి మేలు జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *