మావోయిస్టు కదలికలపై నిరంతరం అప్రమత్తత అవసరం… డీజీపీ అంజనీ కుమార్‌


హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఏ ఒక్క చిన్న సంఘటన జరిగినా అది తెలంగాణా రాష్ట్ర అభివృద్ధి పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని, ఈపరిస్థితుల్లో పోలీస్‌ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని డీజీపీ అంజనీ కుమార్‌ పేర్కొన్నారు. ఇటీవల . దక్షిణ బస్తర్‌ లోని అరుణపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఏప్రిల్‌ 26న జరిగిన మందుపాతర పేలుడులో 10 మంది భద్రతా సిబ్బందితోపాటు ఒక పౌరుడు మరణించిన సంఘటన నేపథ్యంలో రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల పోలీస్‌ అధికారులతో డీజీపీ గురువారం తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ వర్క్‌షాప్‌లో అడిషనల్‌ డీజీ గ్రేహౌండ్స్‌ విజయ్‌ కుమార్‌, అడిషనల్‌ డీజీ సంజయ్‌ కుమార్‌ జైన్‌, ఐజీ ఎస్‌ఐబీ ప్రభాకర్‌ రావు, ఐజీలు చంద్రశేఖర్‌ రెడ్డి, షానవాజ్‌ ఖాసీం ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికలు సవిూపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ ప్రముఖులు, వీవీఐపీల పర్యటన సమయంలో భద్రతా బలగాలు సంచరించే సమయంలో భద్రతా పరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇదే సమయంలో రాష్ట్రాల సరిహద్దుల ప్రాంతాల్లో మావోయిస్టుల యాక్షన్‌ టీంల కదలికలు పెరిగే అవకాశం ఉందని, ఆ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు డీజీపీ సూచించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఐటీ పరిశ్రమలు, అనేక బహుళజాతి సంస్థలు హైదరాబాద్‌ కేంద్రంగా తమ కార్యలయాలు ఏర్పాటు చేసుకున్నాయన్నారు. మావోయిస్టులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని, ఒకర్ని దెబ్బతీయడం వల్ల వేలాది మందిని భయబ్రాంతులకు గురిచేసేలా వ్యవహరిస్తున్నారన్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు డీజీపీ సూచించారు. తెలంగాణలో వామపక్షతీవ్రవాదం పూర్తిగా అంతరించిపోయిందని దీనికి పోలీస్‌ శాఖ నిరంతర కృషే కారణమన్నారు. . మావోయిస్టు చర్యలకు సంబంధించిన కీలక దాడుల్ని ఈ సందర్భంగా డీజీపీ అధికారులకు వివరించారు. రాష్ట్రంలో 80శాతం కొత్తగా విధుల్లో చేరిన పోలీస్‌లు ఉండటం వల్ల మావోయిస్టు వ్యూహాలు, చర్యలు, దాడులపై మరింత అవగాహన ఏర్పరుచుకోవాలని డీజీపీ అంజనీ కుమార్‌ తెలిపారు. అదనపు డీజీపీ(ఆపరేషన్స్‌) విజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ…. పోలీస్‌ దళాల కదలికల్లో మార్పులు, వ్యూహాల్ని ఎప్పటికప్పడు మారుస్తుండాలన్నారు. వీఐపీల వద్ద ఉండే పీఎస్‌ఓలకు మావోయిస్టులు జరిపే ఆకస్మిక దాడులు, అనుకోని పరిస్థితులు ఏర్పడితే భద్రత కల్పించే అంశంపై ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఐజీ ప్రభాకర్‌ రావు మాట్లాడుతూ… రాష్ట్రంలో తీవ్రవాదం పరిస్థితి, పోలీస్‌ తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా సమగ్రంగా వివరించారు. గ్రామస్థాయి ప్రజలతో నిరంతరం మమేకమై మావోయిస్టులు, కొత్తవారి కదలికపై సమాచారం సేకరించాలన్నారు. మరీ ముఖ్యంగా సరిహద్దు గ్రామాల పోలీస్‌లు ఈ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ వర్క్‌షాప్‌లో అన్ని యూనిట్ల అధికారులు, సరిహద్దు ప్రాంత డీఎస్పీలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *