హైదరాబాద్ : ఎండలు ముదురుతున్నాయి. రోజురోజుకూ పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో గత రెండు మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు పైగా నమోదవుతు న్నాయి. సోమవారం గరిష్ఠంగా 36.7, మంగళవారం 36.5, బుధవారం గరిష్ఠ ఉష్ణోగ్రత 35.1 నమోదైంది.
ఉదయం తొమ్మిది గంటలు దాటిందంటే భానుడు భగభగ మండుతుండటంతో రోడ్లన్నీ వెలవెలబోతున్నాయి. ఇప్పటికే ప్రజలు శీతల పానీయాలను ఆశ్రయిస్తుండగా ..అటు ఉక్కపోత నుం చి ఉపశమనం పొందేందుకు కూలర్లు, ఏసీలను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం పగటి ఉష్టోగ్రతలు 30-35 డిగ్రీల వరకు నమోదు కాగా, రాత్రి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకు పైగా ఉంటున్నాయి.
ఎండలతో ఉక్కిరిబిక్కిరి.. మొన్నటి వరకు చలితో సతమతమైన ప్రజలు ప్రస్తుతం ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. భానుడు మార్చి నెలలోనే భగ్గుమంటున్నాడు. దీంతో ఉష్ణోగ్రత లు క్రమంగా పెరుగుతున్నాయి. వారం రోజుల క్రితం తీవ్ర చలిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా వేడెక్కడం తో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. మధ్యాహ్నం పూట భానుడు తన ప్రతాపాన్ని చూపుతుండటంతో ప్రజలు బయటికి వెళ్లేందుకు జంకుతున్నారు. ఉదయం, రాత్రి వేళల్లో చలిప్రభావం ఉన్నప్పటికీ మధ్యాహ్నం సమయంలో ఎండ తీవ్రత పెరుగుతున్నది. రోడ్లు నిర్మాను ష్యంగా మారుతున్నాయి. పెండ్లిళ్ల సీజన్ కావడంతో ప్రజలు తలకు టవల్, టోపీలు, గొడుగులు ధరించి కనపడుతున్నారు. పనుల నిమిత్తం బయటికి వెళ్లాల్సి వస్తే ఉద యం, సాయంత్రం వేళలను ఎంచుకుంటున్నారు. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగి ఎండలు మండుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడే ఈ స్థాయిలో ఉంటే రానున్న ఏప్రిల్, మే నెలల్లో ఎం డల తీవ్రత ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా వ్యవసాయ పనులకు వెళ్లే రైతు లు, కూలీలు ఎండల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు కొబ్బరి బొండాలు, నిమ్మకాయ పానీయాలు, లస్సీ, పండ్ల రసాలు తాగుతున్నారు.
ఏప్రిల్, మే నెలల్లో.. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలతోపాటు రోహిణి కార్తెలో ఎండలు ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తున్నది. రాత్రి పూట చలి, మధ్యాహ్నం వేడిగా ఉంటుంది. ప్రతిరోజూ భిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో వైరల్ జ్వరాలు పెరిగాయి. జ్వరం, దగ్గు, ఒంటి నొప్పులు, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దినసరి కూలీలు ఉదయం సమయంలోనే పనులను పూర్తి చేసుకుని మధ్యాహ్నంలోగా ఇంటికి చేరుకోవాలని వైద్య నిపుణు లు సూచిస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో బయటికి వెళ్లాల్సిన వారు తప్పకుండా గొడుగులు వెంట తీసుకెళ్లాలని చెబుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలని.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచిస్తున్నారు. వడగాడ్పులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో మధ్యాహ్నం బయటికి వెళ్లకపోవడమే ఉత్తమమని పేర్కొంటున్నారు.
ప్రజలు జాగ్రత్తలు పాటించాలి : ఎండల తీవ్రత పెరుగుతున్నది. ప్రజలు మండుటెండల్లో బయట తిరగొద్దు. వేడి గాలులతో వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉంది. పనులుంటే ఉదయం, సాయంత్రం సమయాల్లో పూర్తి చేసుకోవాలి. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో చిన్న పిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు పాటించాలి. బయటకెళ్లే సమయంలో గొడు గును వెంట తీసుకెళ్లాలి. -డాక్టర్ దామోదర్, ఉప వైద్యాధికారి రంగారెడ్డి జిల్లా